Oct 11,2023 23:29

ధర్నాలో యానిమేటర్లు

ప్రజాశక్తి-గుంటూరు : తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ ఎదుట యానిమేటర్లు చేపట్టిన ధర్నా రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. కార్యక్రమానికి యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్షులు దెబొరా అధ్యక్షత వహించగా గౌరవాధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి, 45 ఏళ్ల వయోపరిమితి సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫార్మింగ్‌, నాన్‌ ఫార్మింగ్‌ పేరుతో టార్గెట్స్‌ పెట్టి వేధించే విధానాన్ని అధికారులు మానుకోవాలని కోరారు. అద్దె ఇళ్లల్లో, చిన్న ఇళ్లలో ఉండే డ్వాక్రా మహిళలు గేదెలను, గొర్రెలను, కోళ్లను, మేకలను ఏ విధంగా పెంచాలని ప్రశ్నించారు. యానిమేటర్లకు ఇస్తున్న వేతనాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని కోరారు. డాక్రా మహిళలు నిర్వహించే మహిళా మార్టుల్లోనూ వారానికి రూ.10 వేలు కొనుగోలు చేయాలని యానిమేటర్లకు టార్గెట్స్‌ పెట్టడం సరికాదన్నారు. యానిమేటర్లందరికీ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు శోభారాణి, ఆదిలక్ష్మి, పార్వతి, పద్మ, జ్యోతి తదితరులు మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 36 గంటల ధర్నా అనంతరం డిఆర్‌డిఎ పీడీకి, కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.శివాజీ, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, కాంట్రాక్ట్‌ ఎలక్ట్రిసిటీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నాగరాజు, జనసేన మహిళా విభాగం నాయకులు పార్వతి మద్దతు తెలిపారు.