Sep 09,2023 23:23

ప్రజాశక్తి - ఆకివీడు
          ప్రభుత్వం ఐకెపి యానిమేటర్ల ఉద్యోగాలకు విధించిన కనీస కాలపరిమితి మూడేళ్లను వెంటనే తొలగించి, వారి ఉద్యోగాలకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని సిఐడిఒ మండల కార్యదర్శి తవిటి నాయుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, యానిమేటర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. ఐకెపి యానిమేటర్ల సమావేశం ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం సంఘ నాయకులు బండారు కన్యాకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తవిటినాయుడు మాట్లాడుతూ అధికారులు, రాజకీయ నాయకులు యానిమేటర్లపై వేధింపులను తక్షణమే ఆపివేయాలన్నారు. పాదయాత్రలో జగన్‌ యానిమేటర్ల ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు దాటినా అమలు చేయలేదన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వ వాగ్దానాల అమలుకు త్వరలో రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నామన్నారు. ఈ ఉద్యమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి సుధారాణి, పాకమూరి సాయి నాగమణి, వీరమల్లు నాగమణి, మందల సార, టి.శ్యామల పాల్గొన్నారు.