
రాయచోటి టౌన్ : ప్రభుత్వం యానిమేటర్లకు మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యలర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 36 గంటల దీక్షలు బుధవారం ముగింపు సందర్భంగా ఉద్రిక్తంగా మారాయి. యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాణెమ్మ జి.రెడ్డెప్ప ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై భారీ మానవహారం నిర్వహించారు. అనంతరం యానిమేటర్లు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌లోకి రాకుండా యానిమేటర్లను పోటీసులు అడ్డుకున్నారు. యానిమేటర్లకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమన న్యాయమైన సమస్యలను అధికారులకు తెలియజేందుకు వెళుతున్నామని చెప్పడంతో ఒకింత తగ్గిన పోలీసులు కలెక్టరేట్‌లోకి యానిమేట్లరు వెళ్లేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులతో కలిసి యానిమేటర్ల సంఘం నాయకులు రాణెమ్మ, రెడ్డెప్ప, సుబ్రహ్మణ్యం, పవన్, రమణారెడ్డి మాట్లాడుతూ తమ సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపాలని, లేకపోతే దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం రూ.8 వేలిస్తే సంఘాల సభ్యుల వడ్డీ నుండి రూ.2 వేలు తీసుకున్న విఒఎలకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేలిస్తున్నట్లు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని అక్రమంగా తొలగించిన విఒఎలను విధుల్లోకి తీసుకోవాలని రూ.పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని యఫ్ ఆర్ పాలసీ అమలు చేసి 5జి మొబైల్ ఇవ్వాలని కోరారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ల ఐడీలతో విఒఎలను పనిచేయమని ఆ పని వారిఖాతాలో వేసి విఒఎల పని శూన్యమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే 45 సంవత్సరాల వయోపరిమితి, చదువు వయస్సు జెండర్ అనే తేడాలు సష్టించి యానిమేటర్లను ఇంటికి పంపించే విధంగా భయబ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల భద్రత గౌరవం ఇవ్వక పోవడం దారుణమన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్‌ఒ సత్యనారాయణకు నాయకులు అందజేశారు. జిల్లాలో గ్రూపులు తక్కువ ఉన్నాయనే నెపంతో విధుల నుండి తప్పించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో వెలుగు అధికారులకు యానిమేటర్లకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యానిమేటర్లు పవన్, రెడ్డెప్పరెడ్డి, రమణారెడ్డి, ప్రశాంతి, రామంజులమ్మ, కన్యాకుమారి, చెన్నమ్మ, ప్రసన్న, పెద్దఎత్తున యానిమేటర్లు పాల్గొన్నారు.