ప్రజాశక్తి - యానాం యానాంలో స్వాతంత్య్ర దినోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలో పుదుచ్చేరి ప్రజాపనులశాఖ మంత్రి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా వేడుకల్లో పాల్గొన్నారు. యానాం ఎంఎల్‌ఎ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మంత్రి, ఎంఎల్‌ఎతో పాటు ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్‌పి రఘునాయగం శాంతి కపోతాలను, త్రివర్ణ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. పోలీసులు, హోమ్ గార్డులు, ఆయా పాఠశాలలకు చెందిన స్కౌట్ దళాలు భారీ కవాతు నిర్వహించాయి. పలు పాఠశాలలు విద్యార్థినులు వివిధ నృత్యాలను ప్రదర్శించారు. ఈ నృత్యాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. ఉత్తమ కవాతు, నృత్య ప్రదర్శనలకు మంత్రి, ఎంఎల్‌ఎ బహుమతులు, మెమెంటోలు అందచేశారు. ముందుగా మంత్రి లక్ష్మీ నారాయణన్ స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. స్థానిక ప్రముఖులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఎల్‌ఎ గొల్లపల్లి ఆయన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లయన్స్ క్లబ్ పిల్లరాయ యానాం, నెహ్రూ యువ కేంద్ర, రీజెన్సీ పబ్లిక్ స్కూల్, శ్రీవేద, డ్రీమ్స్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి.










