Mar 26,2023 01:44
యానాది కాలనీలో రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు కత్తి పద్మ

ప్రజాశక్తి-కొత్తపట్నం: రాష్ట్రంలో యానాది కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్య మంత్రి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు కత్తి పద్మ తెలిపారు. శుక్రవారం కొత్తపట్నంలోని చాకిరేవు మెట్ట, మోటు మాలోని కోళ్లఫారం వద్ద గల యానాది కాలనీలో విస్తృతంగా పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కత్తి పద్మ మాట్లాడుతూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు ఆదేశాల మేరకు మండ లంలోని అన్ని యానాది కాలనీలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఇటీవల కోవూరు సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యానాది కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారని ఆ విషయాన్ని నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో ఉన్న యానాదులకు తెలియపరుస్తున్నామన్నారు. యానాదులను సంఘటితం చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ ఒంగోలు నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాలు ఆయన పుణ్యమేనని ఆమె యానాదులకు వివరించారు. పార్టీ మహిళా అధికార ప్రతినిధి తిరుపతి నియోజకవర్గానికి చెందిన కళావతి మాట్లాడు తూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే యానా దులు అభివృద్ధి చెందారని, ఆ విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. కాలనీలలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే వెంటనే స్పందించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని మహిళా ప్రతినిధులు యానాదులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రాపూరి కోటేశ్వరమ్మ, ఒంగోలు నియోజకవర్గ అధికార ప్రతినిధి పొన్నం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.