Jun 03,2023 23:48

ట్రాక్టర్‌లను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో 197 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటి ద్వారా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ లబ్ది పొందాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. శనివారం స్థానిక కాఫీ హౌస్‌ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక కమ్యూనిటీ హైరింగ్‌ కేంద్రం ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. తద్వారా నలుగురైదుగురు గ్రూపుగా ఏర్పడి వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై కొనుగోలు చేసి వారి ఫరిధిలో రైతులకు అద్దెకు ఇచ్చి పంట దిగుబడులు పెందుకోవాలని కలక్టర్‌ సూచించారు. ఏజన్సీలో మూడు లక్షల ఎకరాలలో వ్యవసాయం జరుగుతోందని, రొటేషన్‌ పద్ధతిలో యంత్ర పరికరాలు వినియోగించుకోవాలని సూచించారు. యాంత్రీకరణతో దిగుబడి పెరగడమే కాకుండా ఆదాయం పెరుగుతుందన్నారు. ఇతర పధకాలతో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు సబ్సిడీపై అందజేయటం జరుగుతుందని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయశాఖాదికారులను సంప్రదించాలని కలక్టర్‌ కోరారు.
స్థానిక శాశన సభ్యులు కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయాధార కుటుంభాలు ఉన్నాయని, వారంతా పెదవారైనందున తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ది చేకూర్చే ఆధునిక వ్యవసాయం వైపు మరలాలని, అందుకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగపడుతుందని వివరించారు. మొదటి దశలో 29 ట్రాక్టర్లను అందించామని, ఇప్పుడు రెండో దశలో మరో 32 ట్రాక్టర్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. అరకు శాసనసభ్యులు శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో 95 కమ్యూనిటీ హైరింగ్‌ కేంద్రాలకు రూ. 3,85,25,363 విలువ గల వివిధ రకాల 212 యంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసారు.
లబ్దిదారుల మనోగతం-
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. జి.కే. వీధి రింతాడ సచివాలయ ఫరిధిలో రైతు ఎస్‌.భీమేశ్వర పడాల్‌ మాట్లాడుతూ, ఐదుగురు సభ్యులం కలసి కేవలం లక్ష రూపాయలు కట్టి ట్రాక్టర్‌ కొనుగోలు చేసామని, దానిని వినియోగించి సేద్యం చేయటమే కాకుండా అద్దెకు ఇచ్చి ఆ డబ్బును ఋణం తీర్చడానికి ఉపయోగిస్తామని, తద్వారా అధిక దిగుబడి అధిక లాభాలు సంపాదిస్తామని ఆశాభావం వ్యక్త పరిచారు.
చింతపల్లి మండలం చౌడుపల్లి సచివాలయ ఫరిధిలో కోరాబు కరుణానిధి మాట్లాడుతూ, గిరిజన రైతులు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందించడం ఎంతో ఉపయోగకరమని, ఐదుగురు కలసి గ్రూపుగా ఏర్పడి అన్ని రకాల పరికరాలు తీసుకుంటూ ఒకరికొకరు చేదోడుగ సహకరించుకోవడంతో అందరమూ లబ్ది పొందు తున్నామని ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సరస్వతి, సర్పంచ్‌ ఉషారాణి, డిసిసిబి సిఇఓ వర్మ, జిల్లా వ్యవసాయశాఖాధికారి బిఎస్‌ఎస్‌ నందు, ఆ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, పలువురు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.