Jun 10,2023 21:00

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన, వాటర్‌ షెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల కార్యక్రమంలో భాగంగా రైతులకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీటి వృథాను అరికట్టేందుకు ఫారంపాండ్స్‌ తవ్వుకోవాలని సూచించారు. గ్రామాల్లోని రైతుల పంట దిగుబడి పెంచేందుకు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్ల ద్వారా చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పెద్దహరివాణం, ఎడవల్లి, బలాదూరు, సంతేకుడ్లూరు గ్రామాలకు చెందిన 300 మంది రైతులు లబ్ధి పొందినట్లు చెప్పారు. రైతులు పంట పొలాలకు ఎక్కువ శాతం క్రిమి సంహారక మందులు వాడడం ద్వారా మట్టిలో ఉండే సహజ గుణాలు కోల్పోతున్నాయన్నారు. నీటిని, నేలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. వాటర్‌ షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ సంతోష్‌, సర్పంచి రాము, ఎంపిటిసి వీరేశ్‌, బసప్ప, వైసిపి సీనియర్‌ నాయకులు మెడికల్‌ నాగరాజు, హనుమంతప్ప, బిపి.బలరాం, బాలప్ప, గర్జప్ప, మీసేవ నాగరాజ్‌, సిద్ధప్ప, డీలర్‌ మారెప్ప పాల్గొన్నారు.