ప్రజాశక్తి-తాడేపల్లి:పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై మరింతగా పోరాడటమే చప్పిడి యాకోబుకు అర్పించే నిజమైన నివాళి అని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు నివాళులర్పించారు. యాకోబు వర్ధంతి సభ ఆదివారం రాత్రి తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో బూరుగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా యాకోబు చిత్రపటానికి వేముల దుర్గారావు పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా రామారావు మాట్లాడుతున్న పేదలు ఎక్కువగా నివశిస్తున్న క్రిష్టియన్ పేట ప్రాంతంలో యాకోబు పేదల కోసం నిరంతరం పని చేశారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యునిగా కూలీ రేట్ల పెంపుదల కోసం, కనీస వేతనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారని చెప్పారు. దేశంలో బిజెపి పరిపాలిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో బిజెపి విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసిన రెజ్లర్ల ఆందోళనలపై పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలను ఉపయోగించడం పిరికిపంద చర్య అన్నారు. పూల్వామా కేసులో తన అధికారం నిలబెట్టుకోవడానికి 30 మంది సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టిన బిజెపి ప్రభుత్వం ఒక క్షణం కూడా దేశంలో అధికారంలో ఉండటానికి వీల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, పట్టణ నాయకులు దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి కొట్టె కరుణాకరరావు, పి.గిరిజ, సోలా ముత్యాలరావు, ఎల్.ఆచారి పాల్గొన్నారు.










