May 22,2023 00:14

నినాదాలు చేస్తున కార్మికులు

ప్రజాశక్తి-పాడేరు: సమస్యలు పరిష్కరించాలని అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లోని చింతపల్లి, పాడేరు, ముంచంగిపుట్టు, అరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం మూడో రోజు కొనసాగింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యంతో గత రెండు రోజులుగా కార్మికులు, సిఐటియు నేతలు జరుపుతున్న చర్చలు నేటికీ కొలిక్కి రాలేదు. రోగులతో నిత్యం కిటకిటలాడే వార్డులన్నీ మూడు షిఫ్ట్‌ ల కింద ప్రతిరోజు శానిటేషన్‌ కార్మికులు పరిశుభ్రం చేస్తుంటారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల కొరత కూడా ఉంది. ఈ ఆస్పత్రి 100 పడకలగా ఉన్నప్పుడు 22 మంది పారిశుధ్య కార్మికుల నియమించారు ఇప్పుడు 200 పడకలకు ఆస్పత్రి స్థాయి పెరిగినా అదనంగా సిబ్బందిని నియమించలేదు. దీంతో, తమపై పని భారం పెరిగిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు సిబ్బందిని కూడా నియమించాలని వారి సమ్మె డిమాండ్లలో ఒకటిగా ఉంది. తమ వేతన సమస్యలన్నీ పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణమే తమ సమస్యలపై పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ఆసుపత్రిలో రోగుల తాకిడి పని భారాన్ని గుర్తించి అదనపు సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు
సమ్మె కొన సాగింపు: సిఐటియు
చింతపల్లి:ఆసుపత్రిలో కార్మికుల సమస్యల పరిష్కరించే వరకు సమ్మె కొనసాగింపు జరుగుతుందని సిఐటియు మండల సెక్రెటరీ వి.రామకష్ణ తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్‌, పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు ఎంతోమంది ప్రజలకు నిరంతరం వారి సేవలను అందిస్తున్నారన్నారు. పనికి తగ్గ వేతనం కూడా సరిగా ఇవ్వలేదన్నారు. కనీస వేతనం చెల్లించి, పిఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని, వేతనాలతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి పని భారం తగ్గించాలని, న్యాయమైన సమస్యలు యాజమాన్యం తీర్చేంత వరకు సమ్మె కొనసాగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ప్రాంతీయ వైద్యాలయం కార్మికులు, సెక్యూరిటీ గార్డ్‌ బుజ్జి బాబు, సాయి కుమార్‌, చిన్నబ్బాయి, పారిశుద్ధ కార్మికులు రామారావు, మంగ వేణి, సింహాచలం, గున్నమ్మ పాల్గొన్నారు.