ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలను ఎత్తేసిన పట్టణంలోని గీతా మందిర్ దగ్గరలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు టిసిలు ఇప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్, శేఖర్, ఉదరు, సురేష్, ఆఫ్రిద్, రఘు డిమాండ్ చేశారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మస్తాన్ వలీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భగా వారు మాట్లాడారు. పట్టణంలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలకు సరైన అనుమతులు లేకున్నా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి దాదాపు 250 మంది విద్యార్థులను చేర్చుకున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో అన్నీ పాఠశాలలు తెరచి తరగతులు నిర్వహిస్తున్నారని, రవీంద్ర భారతి పాఠశాల మాత్రం తెరవకుండా మూసివేశారని చెప్పారు. తల్లిదండ్రులు రోజూ పాఠశాల చుట్టూ తిరుగుతున్నారని, ఎవరూ స్పందించడం లేదని తెలిపారు. ఇక్కడ పని చేసిన స్టాఫ్‌ను అడగ్గా సమాధానం చెప్పకుండా సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులకు టిసిలు ఇస్తే వేరే పాఠశాలలో చేర్పించుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారని తెలిపారు. విద్యాధికారులకు తెలియజేసినా స్పందించడం లేదన్నారు. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు టిసి ఇప్పించాలని కోరారు. ఇస్మాయిల్, రఘు, రాజు, గని పాల్గొన్నారు.
పట్టణ ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న నాయకులు










