Dec 27,2022 23:57

సోమవారం లారస్‌లో జరిగిన ప్రమాదంలో సజీవదహనమైన కార్మికుడు

- అనుభవం లేని కాంట్రాక్టర్లకు వర్కులు
- అధికారుల పర్యవేక్షణ కరువు
ప్రజాశక్తి - పరవాడ

ఫార్మా యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. ఉత్పత్తి, కంపెనీ మెయింటినెన్స్‌ నేరుగా యాజమాన్యం చూడాల్సి ఉండగా, కాంట్రాక్టర్లకు అప్పగించడం, అందులోనూ అనుభవం లేనివారికి ఇవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటిపై పర్యవేక్షించాల్సిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వంటి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరవాడ ఫార్మాసిటీలోనే లారస్‌ ల్యాబ్‌ ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా, ఒకరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ప్రమాద విషయాన్ని కంపెనీ యాజమాన్యం, పోలీసులు గోప్యంగా ఉంచారు. నలుగురు సజీవంగా దహనమైన విషయంపై కంపెనీ యాజమాన్యం పోలీసులు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పు తోవపట్టించడానికి ప్రయత్నించినట్లు కార్మికులు మండిపడుతున్నారు.
ప్రమాదాలకు కారణాలు
ప్రమాదాలు జరగడానికి యాజమాన్య లాభాపేక్ష, నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రియాక్టర్‌ టెంపరేచర్‌ మొదటి బ్యాచ్‌ 120 డిగ్రీల నుండి 270 డిగ్రీల మధ్య, రెండవ బ్యాచ్‌ 270 డిగ్రీలు నుండి 400 డిగ్రీలు మధ్య ఉండాలి. ఆ నిర్ణీత టెంపరేచర్‌ దాటితే ఫైర్‌ అవుతుంది. ఇక్కడ కెమిస్ట్రీలు సరిగా టెంపరేచర్‌ గమనించ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీలు అనుభవం లేని కాంట్రాక్టర్లను నియమించి వారితో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వారు లాభాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టి సరైన అనుభవం లేని, శిక్షణ లేని కెమిస్ట్రీలను, హెల్పర్లను నియమిస్తున్నారు. వారికి వర్కు సరిగా తెలియక రియాక్టర్ల టెంపరేచర్‌ గమనించలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కెమిస్ట్రీలు లేకుండా హెల్పర్లతో రియాక్టర్‌ వద్ద పని చేయించడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోటు కెమిస్ట్రీలు, హెల్పర్లకు తక్కువ జీతాలు ఇవ్వడంతో వారు ఒత్తిడి గురవుతున్నారు. యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు లాభాలే పరమావధిగా భావించి అనుభవం లేని వారితో పని చేయించడం వల్ల రియాక్టర్లు ప్రమాదాలకు గురై కార్మికుల దహనమైపోతున్నారు. వీటిపై యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వంటి అధికారుల పర్యవేక్షణ కొరవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, లారస్‌ కంపనీలో ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.