Nov 17,2023 22:51

ప్రజాశక్తి-చిత్తూరు: మామిడిలో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని జెసి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పలమనేరు మండలం కొలమాసనపల్లిలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మధుసుదన్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ప్రభాకర్‌, జిల్లా వ్యవసాయ అధికారి మురళికృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో జెడ్పి చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటగా రైతులు మామిడి సాగు చేస్తున్నారని, తక్కువ ఖర్చుతో నాణ్యత గల ఉత్పత్తులు పొందెలా అవగాహన మరింతగా కల్పించాలని, పశుసంవర్ధక శాఖ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌, సలహా మండలి సభ్యుల సూచనల మేరకు సమావేశాలను వినూత్నంగా వ్యవసాయ క్షేత్రాలలో నిర్వహించడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చికొనేందుకు ప్రయోగాత్మకంగా పరిశీలన అవసరం అన్నారు. సలహా మండలి చైర్మన్‌ మాట్లాడుతూ నాణ్యత, ఎగుమతులు పెంచేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారి శాస్త్రవేత్తల సహకారంతో పూత దశ నుంచి కాయలు ఏర్పడే వరకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సభ్యులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రత్నారెడ్డి, శివ ప్రకాష్‌రాజు, జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి, అధికారులు రమణారెడ్డి, మోహన్‌బాబు, గంగాభవాని, శాస్త్రవేత్త రెడ్డిరాము తదితరులు పాల్గొన్నారు.