ప్రజాశక్తి- దేవనకొండ
వ్యవసాయ పంటల సాగులో రైతులు సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే అధిక దిగుబడులు పొందుతారని డిఆర్‌సి ఎడిఎ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండలంలోని పల్లెదొడ్డి గ్రామ శివారులో వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎఒ సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మిరప పంటలో తెల్ల దోమ, పచ్చ దోమ, తెగుళ్ల నివారణలో యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. తెల్ల, పచ్చ దోమ నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనె, 2.5 గ్రాముల ఆసిపేట్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. అలాగే ఎకరాకు 30 పచ్చ రంగు అట్టలు పెట్టుకోవాలన్నారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఎరువులను తగిన మోతాదులో వినియోగించుకోవాలని తెలిపారు. డిఆర్‌సి వ్యవసాయాధికారి శశిధర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రంగన్న, యోగేంద్ర బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు మానస, ఎంపిటిసి తిమ్మప్ప, వైసిపి నాయకులు చంద్రన్న, రైతులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎడిఎ వెంకటేశ్వర్లు










