Mar 28,2021 06:38

'యా డ్‌ కలర్‌ టు యువర్‌ లైఫ్‌'... ఇదొక పాపులర్‌ క్యాప్షన్‌. జీవితం రంగులమయం. ఇంద్రధనుస్సు లోని రంగులమల్లే జీవితానికి రంగులు అద్దుకోవడం సాధ్యంకాదు. వేర్వేరు రంగులన్నీ కలగలిసి ఒక్కటిగా కనిపిస్తేనే.. అది ఇంద్రధనుస్సు అవుతుంది. కనులకు ఇంపుగా కనిపిస్తుంది. కుటుంబమైనా... దేశమైనా ఇలా కలిసివుంటేనే ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ జీవితం రంగులమయం అవుతుంది. వసంతం ప్రకృతిని రంగులమయం చేస్తుంది. అది హోళీతో ప్రారంభం అవుతుంది. చలికాలం తర్వాత వచ్చే వేసవి కాలానికి వసంత ఋతువు పలికే ఆహ్వాన వేడుకే హోళి. వసంతం రాకతో పులకరించిన ప్రకృతి... మనలో ఆహ్లాదకరమైన స్పందనలు కలిగిస్తుంది. దీనిని రంగుల పండుగగా పరిగణించడానికి కారణం అదే. అయితే, జీవితాన్ని రంగులమయంగా గడపడమంటే ఏమిటి? నిజమైన జీవన సౌందర్యం ఎక్కడుంది? మనిషి జీవితం రంగుల మయం కావాలంటే... 'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోరు' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా... శ్రమైక జీవన సౌందర్యం బతుకంతా నిండిపోవాలి. అప్పుడే... 'అనురాగపుటంచులు చూస్తాం/ ఆనందపు లోతులు తీస్తాం....'


మనలో ప్రతి ఒక్కరూ తన కోసం, తన కుటుంబం కోసమే కష్టపడుతున్నామని అనుకుంటాం. వాస్తవానికి శ్రమ సామాజికం. శ్రమ మనమొక్కరమే చేయం... మనమొక్కరమే ఉపయోగించుకోం. అది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మనమూ ఇతరుల శ్రమను ఉపయోగించుకుంటాం. శరీర కష్టం స్ఫురింప జేసేవేకాకుండా... సాహిత్యం, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి కళలు సైతం శ్రమ నుంచే రూపొందాయి తప్ప రాజుల ఆస్థానాల్లో, పండితుల మెదళ్ల లోంచి కాదన్న సత్యం ఎంగెల్స్‌ వివరించాడు. కనుక మన శ్రమ ఏ రూపంలో తయారైనా అది మన ఒక్కరికోసమే కాదు. అది సమాజం కోసం. ఇదొక సమిష్టి శ్రమ ప్రక్రియ. ఈ సామాజిక శ్రమలోకి... ఈ సమిష్టి ప్రక్రియలోకి పెట్టుబడిదారుడు చొరబడతాడు... మన శ్రమను దోచుకుపోతాడు. శ్రమ చేత సృష్టించబడిన పెట్టుబడి... ఆ శ్రమ చేసిన వ్యక్తినే నలిపివేస్తుంది. ఈ పెట్టుబడిదారీ విధానం మన శ్రమలోని సౌందర్యాన్నంతా నిస్సారంగా మార్చుతుంది. రసహీనంగా తయారు చేస్తుంది. వెలిసిపోయిన రంగుల్లా పాత బట్టలా జీవితాన్ని మారుస్తుంది. కారుమబ్బులు కమ్మేసిన ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది జీవితం. దీనికి కారణం పెట్టుబడిదారీ దోపిడీ.


జీవితం రంగుల మయం కావాలంటే... ఇంద్రధనుస్సు లోని రంగుల్లా మెరిసిపోవాలంటే... మన జీవితాల్లో శ్రమైక జీవన సౌందర్యాన్ని పునరుద్ధరించుకోవాలి. అది దోపిడీరహిత సమాజం లోనే సాధ్యపడుతుంది. ఆ దోపిడీలేని సమాజాన్ని సాధించుకోవడం కోసం పాటుపడడం జీవితానికి సార్థకత ఇస్తుంది. అందుకే పరిపూర్ణమైన మానవతా విలువల కోసం, విజ్ఞాన వికాసం కోసం కమ్యూనిస్టులు, ప్రగతిశీలవాదులు పనిచేస్తారు. కేవలం 27 ఏళ్లు మాత్రమే బతికిన భగత్‌ సింగ్‌ ఆ విధంగానే తన జీవితాన్ని రంగుల మయం చేసుకున్నాడు. ఈ సమాజాన్ని మార్చి... సమాజంలోని మనుషుల జీవితాల్లో ఇంద్రధనుస్సులు పూయించాలనుకున్నాడు. ఆయన తక్కువ కాలమే బతికినా... ఆయన అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయినా... ఆ దిశగా నడిచాడు. పెట్టుబడిదారీ విష కౌగిలిలో నలిగిపోతూ నిస్సత్తువతో, నిస్తేజంతో కునారిల్లే యువతరానికి చైతన్య బావుటా అయ్యాడు. వెలుగు దివ్వెగా మారాడు. మార్గదర్శిగా నిలిచాడు. ఇప్పుడు సమాజాన్ని మార్చడమే మన పని. అప్పుడే జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. పెట్టుబడిదారుడి కోసం నువు పని చేస్తూ... నాకోసం, నా కుటుంబం కోసం పని చేస్తున్నాననే భ్రమలో బతికే జీవితం... జీర్ణమైన వస్త్రంపై వెలిసిపోయిన రంగుల్లాంటిది. వ్యక్తి... శ్రమ... విడదీయలేని విధంగా కలిసిపోయి పరిమళించే జీవితమే... నిజమైన 'శ్రమైక జీవన సౌందర్యం'. అప్పుడే బతుకంతా నిజమైన హోళీగా పల్లవిస్తుంది.