Aug 09,2021 18:18

సింగపూర్‌ : ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో జన్మించి ఓ చిన్నారి రికార్డుకెక్కింది. ఇంతకీ ఆ పాప పుట్టినప్పుడు బరువెంతో తెలుసా.. 212 గ్రాములు. అంటే ఓ యాపిల్‌ పండు బరువు. ఆ పాప పేరు ఏంటంటే.. క్వెక్‌ యు జువాన్‌. ఈ ఆశ్చర్యకర ఘటన సింగపూర్‌లో గత ఏడాది జూన్‌ 9న జరిగింది. సింగపూర్‌కు చెందిన క్వెక్‌ వీ లియాంగ్‌, వాంగ్‌ మెయి లింగ్‌ దంపతులకు జువాన్‌కి ముందే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వాంగ్‌ మెయి లింగ్‌ ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు 25 వారాల గర్భధారణ సమయంలో అధికరక్తపోటు కారణంగా కడుపునొప్పి రాగానే వెంటనే కుటుంబ సభ్యులు నేషనల్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ (ఎన్‌యుహెచ్‌) కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆపరేషన్‌ చేసి..బిడ్డను బయటకు తీశారు. ఆ చిన్నారి బరువును చూసి వైద్య సిబ్బంది అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. ఆపరేషన్‌ చేసే ముందు దాదాపు చిన్నారి బరువు ఐదు వందలు లేక ఆరు వందల గ్రామల బరువు ఉంటుందని డాక్టర్లు అంచనా వేశారు. అయితే వారు ఊహించనివిధంగా.. కేవలం 212 గ్రాములు, 24 సెంటీమీటర్ల పొడవుతోనే జువాన్‌ పుట్టింది. అయితే తక్కువ వారాల్లోనే జన్మించడం వల్ల ఊపిరితిత్తుత్తులు మినహా మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని వైద్యులు నిర్థారించుకున్నాక.. ఆ చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచారు. కృత్రిమ శ్వాస కోసం..గొట్టాలు తొడిగారు. ఇక యూరిన్‌ కోసం..డైపర్‌ని కత్తిరించి..అందులో రసాయనాల్ని కలిపి చిన్నారి చర్మానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా.. నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇలా ఆ పాపని కంటికి రెప్పలా కాపాడారు. దీంతో పాప కూడా రోజురోజుకి బరువు పెరుగుతూ.. మెరుగుదల కనిపించడం వైద్యలు గుర్తించారు. ప్రత్యేకించి నర్సులు మాట్లాడే మాటలను కూడా జువాన్‌ విని.. నవ్వేదట. అలా ఒక నెల కాదు.. రెండు నెలల కాదు.. ఏకంగా 13 నెలలు ఆసుపత్రిలోనే వెంటిలేటర్‌పై వైద్యం అందించి.. గతవారమే జువాన్‌ని డిశ్చార్జ్‌ చేశారు. ఇప్పుడు పాప బరువు ఆరున్నర కేజీలు. చాలా ఆరోగ్యంగానూ ఉంది.

child 4


జువాన్‌ గురించి ఓ వైద్యుడు మాట్లాడుతూ.. 'చిన్నారి అతి తక్కువ బరువుతో జన్మించడం వల్ల మాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా చిన్నారి చర్మం చాలా సున్నితంగా ఉండడంతో పాపని వెంటిలేటర్‌పై ఉంచడం కూడా చాలా కష్టమైంది. శ్వాసనందించడానికి అతి చిన్న పొడవైన శ్వాస గొట్టాన్ని వెతికి మరీ.. పెట్టాల్సి వచ్చింది. ఇక మెడిసిన్‌ కూడా అణువుల్లా ఉండేంత పరిమాణంలోనే ఇవ్వాల్సి వచ్చింది. మా వైద్య బృందం మొత్తం తగు జాగ్రత్తలతో చిన్నారిని కాపాడింది' అని అన్నారు. జువాన్‌లో రోజురోజుకూ ఆరోగ్య మెరుగుదల చూసి.. చుట్టూ ఉన్న వ్యక్తులను ఎంతో ప్రేరేపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో అసాధారణంగా జన్మించిన ఈ శివును కోవిడ్‌ - 19 శిశువుగా అభివర్ణిస్తూ ఆసుపత్రి యాజమాన్యం మీడియాకు తెలిపింది. 2018లో అమెరికాలో 245 గ్రాములతో ఓ బిడ్డ జన్మించగా.. ఆ రికార్డును తాజాగా జువాన్‌ బ్రేక్‌ చేసి ప్రపంచంలోనే అతి చిన్న బేబీగా రికార్డుకెక్కింది.

child 3