ఒక ఏడాది కాలంలో కోవిడ్-19 ప్రభావం శ్రామికుల జీవితాలపై ఏవిధంగా పడింది అన్న అంశాన్ని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లారుమెంట్ అధ్యయనం చేసి ఒక పత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. దానిలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి....
ఉద్యోగాలు పొందడంలో వెనక.. పోగొట్టుకోడంలో ముందు ...
2020 కన్నా ముందు కూడా ఉద్యోగాలు చేసే వయస్సులో ఉండే మహిళలలో కేవలం 18 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. అదే పురుషులలో 75 శాతం ఉద్యోగాలు పొందారు. అంటే అప్పటికే జెండర్ పరంగా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి వచ్చాక ఈ జెండర్ వ్యత్యాసం మరింత పెరిగిందని అధ్యయనంలో వెల్లడైంది.
ఉద్యోగాలు చేస్తున్న పురుషులలో కోవిడ్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు 39 శాతం ఉంటే ఉద్యోగాలు చేస్తున్న మహిళలలో ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు 81 శాతం ఉన్నారు. లాక్‌డౌన్ కాలంలో పనులు కోల్పోయిన పురుషులలో ఆ తర్వాత తిరిగి ఉద్యోగాలు పొందినవారు 93 శాతం ఉంటే, అదే మహిళలలో కేవలం 53 శాతమే తిరిగి ఉద్యోగాలు పొందగలిగారు.
ఉద్యోగాలు పోగొట్టుకున్న పురుషులు తిరిగి ఉద్యోగాలు పొందినప్పుడు మరింత తక్కువ జీతాలకు, మరింత అభద్రతతో కూడిన పనులలో సైతం చేరారు. రెగ్యులర్ ఉద్యోగాలలో అంతవరకూ పని చేసిన పురుషులలో 33 శాతం స్వయం ఉపాధి కి మళ్ళారు. మరో 9 శాతం దినసరి వేతనం మీద పనులలో చేరారు. అదే రెగ్యులర్ ఉద్యోగాలలో అంతవరకూ పని చేసిన మహిళలలో ఉద్యోగాలు కోల్పోయినవారు కేవలం 4 శాతం మాత్రమే స్వయం ఉపాధి పొందగలిగారు. మరో 3 శాతం మాత్రమే దినసరి వేతన ఉద్యోగాలను పొందగలిగారు.
సగటున దినసరి వేతనం కింద పని చేసేవారికి నెలకు రూ.7965 ఆదాయం వస్తోంది. అదే స్వయం ఉపాధి లో సగటున నెలకు రూ.12,955 వస్తోంది. పురుషులలో స్వయం ఉపాధి పనులు పొందినంతగా మహిళలలో పొందలేకపోతున్నారు. తక్కువ ఆదాయం వచ్చే దినసరి వేతన ఉద్యోగాలు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి.
ఉద్యోగాలు పొందడంలో మహిళలు వెనకన ఉన్నారు. అదే ఉద్యోగాలు కోల్పోవడంలోనైతే ముందున్నారు. ఉదాహరణకు- విద్యారంగంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రతీ 100 మందిలో 70 మంది మహిళలే. అదే ఆ రంగంలోనే ఉద్యోగాలు చేస్తున్నవారిలో 20 శాతమే మహిళలు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో పనులు కోల్పోయిన ప్రతీ 100 మందిలో 80 మంది మహిళలు. ఆ రంగంలో పనులు చేస్తున్నవారిలో మహిళల శాతం 40 మాత్రమే.
పెరుగుతున్న ఇంటిచాకిరీ
స్కూళ్ళు మూతబడడం, ప్రజలు ఎక్కువకాలం ఇంటివద్దనే గడపవలసి రావడంతో మహిళలకు ఇంటి వద్ద చాకిరీ చేసే కాలం బాగా పెరిగింది. అంతకు ముందు కాలంలో ఇంటి దగ్గర సగటున రోజుకు రెండు నుండి నాలుగు గంటల పాటు చాకిరీ చేసే మహిళల శాతం 10-20 మధ్య ఉండేది. కరోనా వచ్చాక వారి శాతం 50 కి పెరిగింది. ఒకపక్క ఆదాయం వచ్చే ఉద్యోగాలు పోవడంలో ముందున్న మహిళలు ఇప్పుడు ఆదాయం లేని ఇంటి చాకిరీ చేయడంలో కూడా ముందే ఉండవలసివస్తున్నది. అంటే, రెండు విధాలా మహిళలే నష్టపోతున్నారన్నమాట.
పరిష్కారాలు
1. ఉపాధిహామీ పథకాన్ని విస్తరించాలి. పట్టణ ప్రాంతాలకూ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి.
2. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోడానికి సామూహిక వంటశాలలు నడిపేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే మాస్క్‌లను, చేతి గ్లోవ్స్‌ను, ఇతర పిపిఇ కిట్లను ఉత్పత్తి చేయడానికి స్వయంసహాయ మహిళా బృందాలను పనిలోకి దించాలి. సామాజిక ఆరోగ్య సేవలలో ఉన్న స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక కోవిడ్ అలవెన్స్ కింద నెలకు రూ. 5000 చొప్పున చెల్లించాలి.
3. ఆరోగ్యం, పారిశుధ్యం, పేదరిక నిర్మూలన, పొదుపు పోషకాహారం, తదితర సామాజిక అభివృద్ధి రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచి ఎక్కువమంది మహిళలకు ఉపాధి అవకాశాలు ప్రత్యేకంగా కల్పించాలి.
ప్రభుత్వాలు ఒక దీర్ఘకాల దృష్టితో సామాజికాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వగలిగితే, కోవిడ్-19 వంటి సవాళ్ళు భవిష్యత్తులో ఎదురైనప్పుడు తగిన సన్నద్ధతతో తట్టుకోడానికి వీలవుతుంది. అంతేగాక, పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అనారోగ్యం వంటి సవాళ్ళను ఎదుర్కోడానికి తగిన సామర్ధ్యం పెరుగుతుంది.
/ ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ /










