Oct 07,2023 06:46

తినడానికి ముద్ద
నాలికకొక బద్ద
ముగ్గు కొరకు సుద్ద
పక్షులలో గ్రద్ద

వినుటకింపు పాట
నడచుటకై బాట
రోజులోది పూట
నదిలోన ఇసుక మేట

ఎలుక చేయు కన్నం
గోడలకై సున్నం
యజ్ఞమన్న జన్నం
తినడానికి అన్నం

వేయరాదు పందెం
ఆడరాదు జూదం
పద్యంలో కందం
స్థిరము కాదు అందం

మాధవుడి పక్క రాధ
నొప్పులలో బాధ
గురువు చేయు బోధ
చెపుతారట గాధ

ముక్కు మీద కోపం
తప్పుపనులు పాపం
మునిపెట్టును శాపం
ఎండ వలన తాపం

రేగుతుంది తిక్క
మొరుగుతుంది కుక్క
కరుగుతుంది లక్క
ఎదుగుతుంది మొక్క

గానుకకొక ఎద్దు
గుమస్తాది పద్దు
చదువురాని మొద్దు
ఆదేశం వద్దు

ఏనుగుదట దంతం
నీ వస్తువు సొంతం
వదలాలిట పంతం
పిల్ల పేరు కాంతం

రాసులలో మేషం
భాగిస్తే శేషం
దొంగతనం దోషం
దండిస్తే రోషం
నాటకంలో వేషం