- ప్రతి ఇంటి ఆడ బిడ్డ సమస్య పరిష్కారించడమే మన ద్యేయం
- డీఐజీ అమ్మిరెడ్డి
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : చిత్తూరు జిల్లా పోలీసులు రాష్ట్రంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత, వారి రక్షణే ద్యేయంగా “ప్రతీ గడపకి మహిళా పోలీస్” కార్యక్రమాన్ని శుక్రవారం చిత్తూరు లోని 5వ డివిజన్ సచివాలయంలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆర్.ఎన్.అమ్మి రెడ్డి ఘనంగా ప్రారంబిస్తూ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భముగా డి.ఐ.జి మాట్లాడుతూ “ప్రతి గడపకి మహిళా పోలీస్” సర్వే లో బాగంగా ప్రతి ఇంటికి వెళ్ళే మహిళా పోలీసులు సాధారనంగా కాకుండా వారితో మమేకమై మనసు పెట్టి వారితో మాట్లాడినప్పుడు వారు వారి సమస్యలను ధైర్యంగా తెలియజేస్తారు. ఈ సర్వేలో మనం సత్వర ఫలితాలు సాదించాలంటే మాములుగా ఇతరులు చేసే రేషన్ కార్డుకొ లేదా వ్యాక్సినేషన్ లాంటి ఇతర విదమైన సర్వే లా కాకుండా వారితో కలిసి ప్రతి గడపకి వెళ్ళిన వెంటనే ఈ సర్వే గురించి కాకుండా మొదటగా వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి స్థితిగతులను తెలుసుకొని, వారికి అనుగుణంగా మాట్లాడి, సమస్యలను తెలుసుకొని చిత్తూరు పోలీసు వారు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పొందుపరచాలని తెలిపారు. ప్రతి గడపకి వెళ్ళిన సమయంలో ఆ ప్రదేశంలో ఏం జరుగుతోంది ఏదైనా సంఘవ్యతిరేఖ పనులు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏవైనా జరుగాతాయ అనే దాని పై ఆరా తీసి, ఈ విషయమై ఆ ప్రాంత పోలీస్ అధికారికి తెలియజేసి, ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాములుగా భూ తగాదాలు, లైంగిక, అసూయ వలన నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని, ఈ సర్వే వలన ఇటువంటివి ముందుగా అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో మహిళా పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారు ఎంతో ఉత్సాహంగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళే మహిళా పోలీసులు పరాయి వ్యక్తిల కాకుండా ప్రజలతో కలిసి వారి కుటుంబం లో ఒకరిల కలిసిపోయి, ప్రతి ఇంటి ఆడ బిడ్డ సమస్య పరిష్కరించే దిశగా పనిచేయాలని తెలిపారు. మహిళలకు సేవ చేసేందుకు మరొక మహిళగా ఇది ఒక సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు. వారి ఇంటిలో మీరు ఒక అక్కగా, చెల్లిగా వారికి భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ మధ్య కాలంలో గృహిణిలను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్ళు సైబర్ నేరాలు చేస్తున్నారని, కనుక ప్రతి గడపకి వెళ్ళిన సమయంలో వారికి సైబర్ నేరాల గురించి కూడా అవగాహన కల్పించాలని, మహిళల పై జరిగే ఇతర నేరాల గురించి వాటి శిక్షల గురించి ప్రతి మహిళకు వివరించి, వారిని చైతన్య పరిచి వారు ఎలా జాగ్రత్త పడాలి అనే దాని పై కూడా వారికి వివరించాలన్నారు. మహిళలకు ఎంతో ముఖ్యమైన పోక్సో చట్టం గురించి క్లుప్తంగా వివరించాలని, ప్రతి మహిళా మొబైల్ లో దిశా యాప్ ను ఇన్స్టాల్ చేయించాలని తెలిపారు.
అనంతరం సర్వే సమయంలో ప్రతి ఇంటిలో ఇవ్వడానికి మహిళలకు ఉపయోగపడే అంశాలను పొందుపరిచిన “ప్రతి గడపకి మహిళా పోలీస్” బ్రౌచార్ ను డి.ఐ.జి, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్ప, ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఆవిష్కరణ తరువాత డి.ఐ.జి ఎస్పీతో కలిసి 5వ వార్డ్ లోని ఇళ్ళకు వెళ్లి మహిళా పోలీసులతో కలిసి ఇంటిలోనే వారితో సర్వే చేసి బ్రౌచార్ ను అందజేసి, మహిళా చట్టాల గురించి వారికి వివరించి, వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని తెలుపుతూ పోలీసు అధికారులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారి చేసారు.
- ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం :
- చిత్తూరు జిల్లాలో మహిళలు మరియు పిల్లలపైన జరిగే నేరాలకు సంబంధించి ఒక పూర్తి స్థాయి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి ప్రతి మహిళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి.
- సర్వేలో మహిళలు, పిల్లలఫై జరిగే నేరాలకు, ఆకృత్యాలకు సంబంధించి నేరాల కట్టడి నివారణకై సమాచారాన్ని సేకరించి ఒక యాప్ లో అప్లోడ్ చేస్తారు.
- ఈ కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలోని 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 35 వార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులు టీములుగా ఏర్పడి సంబంధిత క్లస్టర్ వాలంటీర్ల సహకారంతో ఆ వార్డులోని అన్ని ఇళ్ళను సందర్శిస్తారు.
- ఆ ఇంటిలోని మహిళలతో మాట్లాడుతూ, ఆ ఇంటికి సంబంధించి గాని, ప్రాంతానికి సంబంధించి గాని మహిళలపై లేదా పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల గురించి సమాచారం సేకరిస్తారు.
- ఆ సమాచారాన్ని ఒక యాప్ లోని ఫార్మాట్ లో పొందుపరుస్తారు. గుర్తించిన నేరాన్ని, సమస్యలను, ఇబ్బందులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు, డిఎస్పి స్థాయి అధికారులు జిల్లా ఎస్ పి దృష్టికి కూడా డాష్ బోర్డు రూపంలో వెళుతుంది.
- గుర్తించిన సమాచారంఫై సంబంధిత ఎస్ హెచ్ ఓ లు వెంటనే చర్యలు తీసుకుంటారు.
- సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులు పర్యవేక్షించి సూచనలు ఇస్తారు. సర్వేలో మహిళా పోలీసులు ప్రతి ఇంటికి ఒక బ్రోచర్ ఇస్తారు. అందులో బాలికలు, మహిళలపై జరిగే నేరాలు, గృహహింస నేరాలపై ఎలా జాగ్రత్త పడాలి, ఇంకా రోజువారీ జరిగే సైబర్ నేరాలపై, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇంకా అవసరంలో ఉపయోగించాల్సిన ఫోన్ నెంబర్లు, అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. నేరాల గురించి సమాచారం అందులో పొందుపరిచిన నెంబర్ ల ద్వార వెంటనే తెలియపరచవచ్చు.
- ప్రతి ఫోన్ లో ఖచ్చితంగా ఉండ వలసిన దిశా యాప్ డౌన్లోడ్ చేయవలసిన విధానం ఉంటుంది. ఈ కార్యాచరణలో చిత్తూరు జిల్లా యంత్రాంగం, అధికారులు సచివాలయం స్థాయి అధికారులు మరియు వాలంటీర్లు పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి,, జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, చిత్తూరు మునిసిపల్ కమీషనర్ జె.అరుణ, నగర మేయర్ ఆముద, 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఎస్.ఇ.బి. శ్రీలక్ష్మీ, దిశా డి.ఎస్పీ జె.బాబు ప్రసాద్, చిత్తూరు పట్టణ డి.ఎస్పీ కె.శ్రీనివాస మూర్తి, ఎస్.బి. డి.ఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఎస్ సి, ఎస్ టీ సెల్, ట్రాఫిక్ డి.ఎస్పీ విష్ణు రఘువీర్, డి.టి.సి. డి.ఎస్పీ శ్రావణ్ కుమార్, పట్టణ సి.ఐ.లు, ఎస్.ఐ. లు, సిబ్బంది పాల్గొన్నారు










