Jul 31,2021 20:22

న్యూఢిల్లీ : భారత్‌, చైనా మధ్య సైనిక స్థాయి 12వ దఫా చర్చలు చైనా వైపు సరిహద్దు ప్రాంతమైన మోల్దోలో శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తూర్పు లడఖ్‌లో పూర్తిస్థాయి బలగాల ఉపసంహరణ, ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకడంలో భాగంగా గోగ్రాతో పాటు హాట్‌స్ప్రింగ్స్‌ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు తుది ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయి. ఏప్రిల్‌ 9న భారత్‌ వైపు ఎల్‌ఎసి వెంబడి చుషూల్‌ సరిహద్దు ప్రాంతంలో 13 గంటల పాటు 11వ రౌండ్‌ చర్చలు జరిగాయి. ప్యాంగ్యాంగ్‌త్సో సరస్సుకు రెండు ఒడ్డుల వైపున ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తయిన విషయం తెలిసిందే. గోగ్రాతో పాటు హాట్‌స్ప్రింగ్స్‌, డెమ్‌చోక్‌, దెప్సాంగ్‌ ఘర్షణాయుత ప్రాంతాలను పరిష్కరించాల్సి ఉంది. ముందస్తు చర్చల్లో భాగంగా కొన్నిచోట్ల బఫర్‌ జోన్లు ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మేజర్‌ జనరల్‌ స్థాయిలో మరో రౌండ్‌ చర్చలు త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ అనంతరం గాల్వాన్‌ ఏరియాలోని కెఎం120, పెట్రోలింగ్‌ పాయింట్‌ (పిపి)15, పిపి17, రేచిన్‌లా, ప్యాంగ్యాంగ్‌త్సో దక్షిణ ఒడ్డున్న ఉండే రేజాంగ్‌లా అనే ఐదు అదనపు వివాదాస్పద ప్రాంతాలు ముందుకొచ్చాయి.