Aug 08,2021 20:28

అడవులు రక్షించాలని నినదిస్తున్న గ్రామీణులు
అహ్మదాబాద్‌ :
గుజారాత్‌లోని కచ్‌ జిల్లాలో సంగ్నారా ఒక చిన్న గ్రామం. పవన శక్తి (వైండ్‌ ఎనర్జీ) కంపెనీల వినాశకర ప్రభావం నుంచి తమ అడవులను కాపాడుకునేందుకు గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తమ గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో గాలిమరల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గాలి మరల ఏర్పాటు వల్ల సహజ వనరులతో పాటు పశువులకు మేత లభించదని, అటవీ భూములు నాశనమవుతాయని పేర్కొంటున్నారు. పవన శక్తి కంపెనీలకు కచ్‌ జిల్లా ఒక దోపిడీ జోన్‌గా ఉంది. గత కొన్నేళ్లుగా కంపెనీలు ఇక్కడ వేలాది సంఖ్యలో గాలిమరలను ఏర్పాటు చేశాయి. సంగ్నారా అటవీ ప్రాంతంలో వివిధ వన్యప్రాణులు, విభిన్న వృక్షాలు, జంతువులతో కూడిన జీవవైవిధ్యం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐదేళ్ల క్రితం సుజ్లాన్‌ కంపెనీ మొదటిసారిగా వైండ్‌ ఎనర్జీ టర్బైన్‌ను ఏర్పాటు చేసింది. దీనికోసం వందలాది చెట్లు నరికివేయడంతోపాటు కొండ ప్రాంతాలను చదును చేశారు. యంత్రాల శబ్ధం, ఇతరత్రా కార్యకలాపాల కారణంగా సదరు ప్రాంతంలో పక్షులు, జంతువులు లేకుండా పోయాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా, స్థానిక అధికారులు మరో 40 గాలిమరల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను ఎన్‌జిటి స్వీకరించింది. ఇటీవల సుజ్లాన్‌ సంగ్నారా గ్రామ సమీపంలో మరో రెండు గాలిమరల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనలకు దిగారు. కంపెనీ వాహనాలు అడవిలోకి ప్రవేశించకుండా స్థానికులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల సాయంతో కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించింది. గాలిమరల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వందలాదిమంది గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు.

 గాలిమరలపై గుజరాతీల పోరు


 

 windmill project :  గుజరాతీల పోరు