Jul 31,2021 16:07

మాస్కో : ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ వాట్సాప్‌కు రష్యాలో భారీ షాక్‌ తగిలింది. రష్యా దేశ నియమాలను ఉల్లఘించినందుకు ఆ దేశ ప్రభుత్వం సుమారు మూడు మిలియన్ల రూబెల్స్‌ను వాట్సాప్‌పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్‌ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్‌ విఫలమైంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే రష్యా ప్రభుత్వం వాట్సాప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ప్రొసీడింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. కాగా, ఈ విషయంపై ఫేస్‌బుక్‌ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితమే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌పై కూడా రష్యా ప్రభుత్వం 3 మిలియన్ల రూబెల్స్‌ను జరిమానా విధించింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్‌ కోర్టు ఫేస్‌బుక్‌, ట్విటర్‌పై కూడా జరిమానాను విధించింది. రష్యా అడ్మినిస్ట్రేటివ్‌ దిగ్గజ కంపెనీలపై జరిమానాలను విధించడం గత కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది.