- నీట మునిగితేనే పరిహారం
- ఉమ్మడి తూ.గోలో ప్రారంభమైన పంట నష్టాల గణన
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్రప్రభుత్వం అనేక నిబంధనలతో కొర్రీ పెడుతోంది.వర్షాలకు వరి పంట కోయకుండా ఉండి నీటిలో తడిచి పాడైపోయిన, మొలకెత్తిన వరి పంటకే పరిహారం వర్తించేలా నిబంధనలు విధించింది. అది కూడా ఎకరాకు రూ.ఆరువేలు మాత్రమే పరిహారం అందించనున్నారు. పనలపై దెబ్బతిన్న పంటలకు, కళ్లాల్లో ఉంచిన ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినా వాటిని పరిగణలోకి తీసుకోకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. గ్రామ స్థాయిలో విఆర్‌ఒ, సర్పంచ్, వ్యవసాయ సహాయకుడు, ఒక రైతు, మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారి, తహశీల్దార్, ఎంపిడిఒలతో కమిటీలుగా ఏర్పడి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 1.63 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటలను ముంచెత్తాయి. అప్పటికే 76 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 9,200 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో రబీ సాగవ్వగా వర్షాల సమయానికి 77,422 ఎకరాల్లో కోతలు పూర్తి అయ్యాయి. తొమ్మిది మండలాల్లో 104 గ్రామాల్లో 2,300 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అంచనా వేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 1.37 లక్షల ఎకరాల్లో సాగవ్వగా వర్షాల సమయానికి సుమారు 95 వేల ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు.18 మండలాల పరిధిలో 62 గ్రామాల్లో 2840 ఎకరాల్లో కోయకుండా ఉన్న వరి నీట మునిగినట్లు అంచనా వేశారు.
- నిబంధనల కొర్రీ
పంట నష్ట పరిహారం కోసం ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి ఖర్చులు అవుతుంటే ఎకరాకు రూ.ఆరు వేలు మాత్రమే పరిహారం ఇవ్వనున్నారు. వర్షాలకు వరి పంట కోయకుండా ఉండి నీటిలో తడిచి పాడైపోయిన, మొలకెత్తిన వరి పంటలకే పరిహారం వర్తించేలా నిబంధన పెట్టారు. 33 శాతంపైన పంట నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వనున్నారు. పనలపై పాడైన పంటకు, కళ్లాల్లో ఉంచిన ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినా వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు.
కాకినాడ జిల్లాలో సుమారు ఆరు వేల ఎకరాల్లో పనలపై ఉన్న పంటకు నష్టం వాటిల్లింది. సుమారు ఏడు వేల ఎకరాల్లో 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశులు తడిసి మొలకలు వచ్చాయి. కోనసీమ జిల్లాలో 563 ఎకరాల్లో పనులపై పంటకు, రాశులుగా ఉన్న 26 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 625 ఎకరాల్లో పనలపై ఉండగా రాశులుగా ఉన్న 9,167 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీరిలో అనేకమంది రైతులు వర్షాల వలన నష్టపోయి తక్కువ ధరకు బయట మార్కెట్‌లో ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. 75 కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.300 వరకూ కోల్పోయారు. ఎకరాకు 50 బస్తాలు దిగుబడి వస్తే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు వరకూ రైతులు నష్టపోయారు.
సామర్లకోట-పిఠాపురం రోడ్డులోని దేవుని మాన్యం భూమి 15 ఎకరాలు సాగు చేశాను. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని 10 రోజులు ఆరబెట్టాను. బస్తాకు ఎనిమిది కేజీల చొప్పున తరుగు తీసుకున్నారు. తేమ, నూక శాతం పేరుతో ఒక్కో బస్తాకు రూ.170 కోల్పోయాను. మొత్తం 270 బస్తాలకు రూ.45,900 కోత విధించారు. నష్టపోయిన వారందరికీ నిబంధనలు సడలించి పరిహారం ఇవ్వాలి.
- చెల్లుబోయిన పవన్ కుమార్, కౌలు రైతు, సామర్లకోట










