
బెంగళూరు : కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ, మహారాష్ట్ర సరిహద్దులుగా కలిగిన ఎనిమిది జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 9 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన బెల్గావి, బీదర్, విజయ్పురా, కల్బుర్గిలతో పాటు కేరళ సరిహద్దులుగా కలిగిన దక్షిణ కన్నడ, కొడగు, మైసూరు, చామరాజ్ నగర్‌లలో ఈ కర్ఫ్యూ అమలు కానుంది. అత్యవసర కార్యకలాపాలు మినహా ఎవరూ బయటకి రాకూడదని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. నిత్యావసరాల దుకాణాలు, తోపుడు బళ్లు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరవవచ్చని తెలిపింది. రెస్టారెంట్లు హోమ్ డెలివరీ చేయవచ్చని ప్రకటించింది. పబ్‌లు, బార్‌ల్లోకి అనుమతి లేదని, లిక్కర్ షాపులకు మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరవవచ్చని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంబంధిత సంస్థలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుందని తెలిపింది.