Aug 02,2021 00:00
ఢిల్లీకి బయలుదేరిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

* హస్తినకు బయల్దేరిన స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో :
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయ్యాలన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాన్ని ఓడిస్తామంటూ, ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించుకునే వరకు ఉద్యమం ఆపేదిలేదంటూ ఉక్కు పట్టుదలతో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆదివారం హస్తినకు బయల్దేరారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు 2, 3 తేదీల్లో ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉక్కు ఉద్యమ సెగ హస్తినకు తాకాల్సిన అవసరం ఉందంటూ మంత్రి ముత్తంశెట్టి, ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించి ఈ ధర్నాకు మద్దతు పలికారు. విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి నేతృత్వంలో వైసిపి, సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన కార్పొరేటర్లు స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు విశాఖ నగరంలోనూ సోమవారం ధర్నా చేయనున్నారు. ఢిల్లీ స్థాయికి ఉద్యమం వెళితే తప్ప కేంద్ర పాలకులు స్పందించరని అన్ని పార్టీలూ ఏకోన్ముఖంగా చెబుతున్నాయి. ఆదివారం రాత్రి రెండు విమానాల్లో స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలు ఢిల్లీకి బయల్దేరారు. రెండు రోజుల నుంచి కూడా ప్లాంట్‌లోని వివిధ భాగాల కార్మికులు రైళ్లలో ఢిల్లీకి వెళ్లారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉద్యమం చేపడతామని స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం నాయకులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరాం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ ఉద్యమంలో పాల్గని మద్దతుగా నిలిచి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్‌ రక్షణలో భాగస్వామ్యం కావాలని స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.