Jul 25,2021 20:53
ర్యాలీ ప్రారంభంలో మాట్లాడుతున్న సిహెచ్‌.నర్సింగరావు తదితరులు

ప్రజాశక్తి - ఉక్కునగరం, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన వచ్చే నెల 2, 3 తేదీల్లో చేపట్టే చలో పార్లమెంట్‌ను జయప్రదం చేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, నిర్వాసితులు కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ వరకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముస్తాఫా జంక్షన్‌ మీదుగా కణితికాలనీ, వడ్లపూడి, దువ్వాడ రైల్వేస్టేషన్‌ రోడ్డు వరకు సాగింది. అనంతరం జాతీయరహదారి మీదుగా దీక్షా శిబిరానికి పాదయాత్ర చేరుకుంది. ప్రజానాట్యమండలి కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రజల్ని చైతన్యపర్చారు. ఈ సందర్బంగా పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ఎదిరించి విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్నారు.

దువ్వాడ స్టేషన్‌ రోడ్డులో సాగుతున్న పాదయాత్ర
దువ్వాడ స్టేషన్‌ రోడ్డులో సాగుతున్న పాదయాత్ర

కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు కార్మికుల పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు వచ్చే నెల 2, 3 తేదీల్లో ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వైటి.దాస్‌, జె.సింహాచలం, మురళీరాజు, జె.రామకృష్ణ, కొమ్మినేని శ్రీనివాస్‌, సిహెచ్‌ సన్యాసిరావు, విళ్లా రామ్మోహన్‌కుమార్‌, పి.సురేష్‌ బాబు, పరంధామయ్య, డేవిడ్‌, వరసాల శ్రీనివాస్‌, మహాలక్ష్మి నాయుడు, జిఆర్‌కె నాయుడు, అప్పలరాజు పాల్గన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని, చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ జనసేన ఆధ్వర్యాన అగనంపూడిలో ప్రజాచైతన్య పాదయాత్ర జరిగింది.