Jul 25,2021 12:21

విశాఖ : ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే విశాఖకు ఇప్పుడిప్పుడే మెరుగులు దిద్దుతున్నారు. కానీ అరకు అందాలను చూపిస్తూ పర్యాటకులను మురిపించే అరకు అద్దాల కోచ్‌లు మాత్రం కనిపించడం లేదు. పేరుకు రిజిస్ట్రేషన్‌ మాత్రం విశాఖ అనే ఉంటుంది. విశాఖను ఇలా చూసి.. అలా వేరే ప్రాంతాలకు అద్దాల కోచ్‌లు వెళ్లిపోతున్నాయి ! ఇదేమిటీ అంటే.. ఏమీ పట్టనట్లు తేలికగా కొట్టిపారేస్తున్నారు రైల్వే అధికారులు.

ఒక్క కోచ్‌ మాత్రమే నడుస్తోంది..
ప్రస్తుతం విశాఖ-అరకు మధ్య నడుస్తున్న ఒక్క అద్దాల కోచ్‌ కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. విశాఖ-అరకు మధ్య అదనపు అద్దాల కోచ్‌ల సౌకర్యాలను కల్పిస్తే మరింత డిమాండ్‌ పెరుగుతుంది. కానీ ఇలా ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల పర్యాటకానికి పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. విశాఖ-అరకు మార్గంలో 5 విస్టాడోమ్‌ కోచ్‌లతో ప్రత్యేక పర్యాటక రైలు నడపాలనే ప్రతిపాదన 2016 నుండే ఉంది. అప్పటినుంచి తయారైన కోచ్‌లను విశాఖకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్క కోచ్‌ మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంచుతూనే ఉన్నారు.

విశాఖ పర్యాటకానికి దెబ్బ.. అరకు అద్దాల కోచ్‌లను మరలించారు...



వచ్చినట్లే వచ్చి.. ముంబయికి..
ఈసారి విశాఖ-అరకు మధ్య రావాల్సిన రెండు విస్టాడోమ్‌ కోచ్‌ల్ని కూడా తీసుకున్నట్టే తీసుకుని.. ఆ తర్వాత ముంబయికి తరలించేందుకు దగ్గరుండి మరీ తూర్పు కోస్తా రైల్వే సహకరించింది.
మొదటి కోచ్‌ : గత నెలలో ముంబయి సిఎస్‌ఎంటి-పుణె రైలు (01007/08) కు విస్టాడోమ్‌ (అద్దాల) కోచ్‌లను ప్రారంభించారు. ఇందులో ఒకటి విశాఖ నుంచి తరలివెళ్లింది. '204708' నంబరుతో రిజిష్టర్‌ అయిన అద్దాల కోచ్‌ విశాఖకు వచ్చాక కోచింగ్‌ డిపోలో ఉంచారు. అక్కడినుంచి ముంబయికి తరలించారు.
రెండో కోచ్‌ : వారం రోజుల క్రితం మరో విస్టాడోమ్‌ కోచ్‌ విశాఖకు వచ్చింది. ఇది '204709' నంబరుతో రిజిష్టర్‌ అయ్యింది. విశాఖకే కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది. కానీ దీన్ని కూడా ముంబయికి తరలించాలని ఆదేశాలు రావడంతో వాల్తేరు అధికారులు వెంటవెంటనే ఏర్పాట్లు చేశారు. ఈ కోచ్‌ను అక్కడి సెంట్రల్‌ రైల్వే అధికారులు ఇంకా ఉపయోగించలేదు. త్వరలో ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. ముంబయి-పుణె మధ్య ప్రస్తుతం తిరుగుతున్న విస్టాడోమ్‌ కోచ్‌ మీద 'తూర్పుకోస్తా (ఈకో)' అని రాసి ఉంటుంది. అంటే.. తూర్పు కోస్తా రైల్వేకి చెందిందన్నమాట. ఈ జోన్‌లో ఒక్క విశాఖ-అరకు మార్గంలో తప్పితే మరెక్కడా ఈ కోచ్‌ వినియోగానికి ప్రతిపాదనలు లేవు.

విశాఖ పర్యాటకానికి దెబ్బ.. అరకు అద్దాల కోచ్‌లను మరలించారు...



కోచ్‌లను కాపాడుకుంటారా ?
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్‌) నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ కే 4 అదనపు అద్దాల కోచ్‌లు వస్తాయని, ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వచ్చిందని అప్పట్లో వాల్తేరు అధికారులకు సైతం సమాచారం వచ్చింది. మరో రెండు కోచ్‌లు విశాఖకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటిని కాపాడుకుంటారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకమే. అదనపు కోచ్‌ల విషయంలో మాత్రం వాల్తేరు అధికారులు... 'అరకు మార్గంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనపు విస్టాడోమ్‌ కోచ్‌ల్ని ఏర్పాటు చేయవచ్చు' అని చెబుతున్నారు. ఇకనైనా విశాఖ-అరకు మధ్య అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తారా ? చూడాలి !