Aug 01,2021 09:57

విశాఖ : విశాఖ ఉక్కు పోరాట ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో...కార్మిక సంఘాల నేతలు కదిలారు. ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వేలాదిమంది కార్మికులు బయలుదేరారు. రేపు, ఎల్లుండు రెండురోజులపాటు జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. తెలుగు ప్రజల పోరాటపటిమను చాటనున్నారు.
     ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ... విశాఖ ఉక్కును కాపాడాలంటూ... రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్రం ఏమీపట్టనట్లు ఉందని అన్నారు. తమ ఉద్యమానికి ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నామన్నారు. హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలం, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన తర్వాతే విశాఖ ఉక్కు సాధ్యమయిందని, ఎంతోమంది పోరాటం చేసి సాధించుకున్నది విశాఖ ఉక్కు అని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగాలకయినా వెనుకాడబోమని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. రేపు, ఎల్లుండు జంతర్‌మంతర్‌ వద్ద తాము మహాధర్నా చేపట్టనున్నామని ప్రకటించారు.