
ముంబయి : ప్రముఖ బాలివుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ (63) మరణించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో గతవారం ముంబయిలోని ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు ఆయన స్నేహితుడు యశ్పాల్ శర్మ తెలిపారు. 2009లో స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ప్రముఖ సీరియల్ 'మన్‌కీ ఆవాజ్ : ప్రతిగ్యా' లోని టాకూర్ సజ్జన్ సింగ్ పాత్రతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్', 'బండిట్ క్వీన్' చిత్రాల్లో పోషించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాలుగా టివిషోలతో పాటు సినిమాల్లో పలు పాత్రల్లో నటించిన ఆయన ప్రేక్షకులను మెప్పించారు. 'సత్య, దిల్‌సే, లగాన్, హజారోన్ ఖవైషేని ఐసీ' ల్లో నటించారు. ఇటీవల షూటింగ్ ముగిసిన 'మన్‌కీ ఆవాజ్: ప్రతిగ్యా' సీజన్ 2 షూటింగ్‌లో కూడా పాల్గన్నారు. గతేడాది డయాలసిస్ కోసం గుర్‌గాన్ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో చికిత్సకు కొనసాగించేందుకు సహాయం అందించాల్సిందిగా స్నేహితులు, టివి, సినీ పరిశ్రమను కుటుంబసభ్యులు ట్విటర్ ద్వారా వేడుకున్న సంగతి తెలిసిందే.