Mar 29,2023 23:03

ప్రజాశక్తి - విజయవాడ రూరల్‌ : జీవకోటి అనారో గ్యానికి కారణమైన వయ్యారి భామ కలుపు మొక్క లను నివారించి బావితరాల ఆరోగ్యాని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు కోరారు. పార్థీనియం మొక్కల సామూహిక నిర్మూల కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి పార్థీనియం కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలను తొలగించి దగ్ధం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జీవకోటి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపడంతో పాటు పంటల ఎదుగుదలలో దుష్పలితాలను ఇస్తున్న పార్థీనియం వయ్యారి భామ కలుపు మొక్కలను నివారించి భావితరాల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సి ఉందన్నారు. 1950 దశకంలో ఇతర దేశాల నుండి గోధుమలు దిగుమతుల ద్వారా పార్థీనియం కలుపు మొక్కల విత్తనాలు మన దేశానికి ప్రవేశించడం జరిగిందన్నారు. అప్పటి నుండి పంట పొలాలు బహిరంగ ప్రదేశాలు పాఠశాలలు, రహదారులకు ఇరువైపులు, చెరువుగట్ల వంటి ప్రదేశాలలో ఈ మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పార్థీనియం మొక్క ఊపిరితిత్తులవ్యాధి, చర్మవ్యాధులు, జ్వరం వంటి బాధలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.