- సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా మహాసభలో అజరుకుమార్
ప్రజాశక్తి-విజయవాడ: వ్యవస్థ మార్పు ద్వారానే ఉద్యోగ, కార్మిక, కర్షక కష్టాలు తీరుతాయని, అందుకు అందరూ కలిసిగట్టుగా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని సిహెచ్.శ్రీలక్ష్మీ నగర్ (మాడపాటి క్లబ్)లో రెండు రోజుల పాటు జరగనున్న సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా 11వ మహాసభలో తొలిరోజు జరిగిన ప్రతినిధుల సభకు ఎ.వెంకటేశ్వరరావు, కె.దుర్గారావు, ఎం.సీతారాములు, ఎన్‌సిహెచ్ సుప్రజ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సభనుద్దేశించి అజరుకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల సమస్యలపైనే కాకుండా వ్యవస్థ మార్పు కోసం ఉద్యమాలను విస్తరించాల్సి ఉందన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు అనుసరిస్త్తోన్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల 90 శాతం మంది కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష పాలనలో ఉన్న కేరళ రాష్ట్రంలో పని భద్రతతో పాటు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆ రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఒక రాష్ట్రంలో కార్మిక అనుకూల ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుందనే దానికి కేరళ ఒక మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఎపిఎస్‌జిఒ సంఘం ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు మెరుగైన వేతనాలు, ఇతర సంక్షేమ పథకాలు ఏమో కానీ...ప్రతి నెలా ఒకటో తేదీన జీతం ఇవ్వాలని అడుక్కునే దైనీయ పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబడిందన్నారు. పది సంవత్సరాల్లోపు ఆయా రంగాల్లో పని చేస్తున్న 1.50 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికుల మెడపై కత్తి వేలాడుతుందని, వీరందరినీ ఇంటి దారి పట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సిఐటియు, ఇతర ఉద్యోగ, కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాల కారణంగా ప్రస్తుతానికి ప్రభుత్వం ఆగిందని తెలిపారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను పార్లమెంట్‌లో ఎటువంటి చర్చ లేకుండానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా సిఐటియు చేస్తున్న పోరాటాలకు ఎపిఎన్‌జిఒ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ గడిచిన మహాసభ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో నిర్వర్తించిన పోరాటాల నివేదికతో పాటు భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. తొలుత మహాసభ ప్రారంభసూచికగా సీనియర్ నాయకులు ఎంఎన్ పాత్రుడు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. సంతాప నివేదికను ఎంవి సుధాకర్ ప్రవేశపెట్టారు. ఈ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డివి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
33 తీర్మానాలు ఆమోదం
ఈ సందర్భంగా 33 తీర్మానాలను ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్మికులకు రూ.26 వేలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టం అమలు చేయాలని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, ప్రసూతి సెలవుల చట్టం అమలు చేయాలని తదితర తీర్మానాలను ప్రవేశపెట్టారు.










