ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. గతనెల 19, ఈనెల 2వ తేదీన సమావేశం జరుగుతుందని ప్రకటించినా ఇప్పటికి రెండుసార్లు వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.
జిల్లాలో ప్రధానంగా వర్షాభావంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు సమావేశంలో వివిధ శాఖలపై చర్చించనున్నారు. పల్నాడు జిల్లాను వర్షాభావం వెంటాడుతోంది. ఖరీఫ్ సాగుపై అయోమయం ఏర్పడింది. సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయవద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలుసాగు అవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు రెండు లక్షల ఎకరాల్లో కూడా పంటలను సాగు చేయలేకపోయారు. తాజాగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత మంది రైతులు మిర్చి సాగు చేస్తున్నా వారు కూడా రానున్న మూడు నెలల్లో సాగర్ జలాశయానికి నీరురాకపోతే తమ పరిస్థితి ఏమిటన్నదీ అంతుబట్టడం లేదని వాపోతున్నారు. డిసెంబరు నుంచి మార్చిలోగా మిర్చికి మూడు తడులు నీరందించగలిగితేనే కొంతవరకు మంచి దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. నీరు రాకపోతే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాదంటున్నారు. అలాగే వరి సాగు చేసే భూముల్లో ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలన్నదీ అధికారులు రైతులకు ఇంకా పూర్తిగా అవగాహన కల్పించలేకపోయారు.
పల్నాడులో వరుసగా మూడు నెలల పాటు వర్షపాతం భారీగా లోటు ఉండటం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువును ఎదుర్కొంనేందుకు వీలుగా రైతులను సన్నద్ధం చేయడంపై యంత్రాంగం ఇంకా దృష్టిసారించడం లేదు. కృష్ణా డెల్టాలో పట్టిసీమ నుంచి గోదావరి జలాలు వస్తున్నా పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికి కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వకపోవడం వల్ల చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బాపట్ల జిల్లాలోని చీరాల డివిజన్‌లో ఇబ్బందులు నెలకొన్నాయి.
వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది సరిగా పని చేయకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పిహెచ్‌సి, సిహెచ్‌సిలకు వైద్యులు, సిబ్బందిసరిగా పనిచేయని పరిస్థితినెలకొందని ప్రతి సమావేశంలో జెడ్‌పిటిసి, ఎంపిపిలు అధికారులను నిలదీస్తుంటారు. విద్యాశాఖకు సంబంధించి పాఠశాలల్లో నాడు-నేడు పనులు మందగమనంగా సాగుతున్నాయి. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల కొరత, ఏడాది పొడవునా సిఫార్సులతో బదిలీలు వల్ల విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. విద్యార్థులు అధికంగా ఉన్న జెడ్‌పి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విలీనం వల్ల దూరం పెరిగి పలువురు విద్యార్థులు పాఠశాలలకు దూరం కావడం, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లాలో సాంఘికసంక్షేమ శాఖకు సంబంధించి వసతిగృహాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం, అసౌకర్యాల నడుమ ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా వివిధ శాఖలకు సంబంధించి జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు క్షేత్రస్థాయి సమాచారంతో ప్రశ్నించిన సందర్భంలో సమాధానం చెప్పడానికి జిల్లా అధికారులు పలుమార్లు ఇబ్బంది పడిన పరిస్థితులు నెలకొంటున్నాయి.