Oct 11,2023 23:01

వ్యవసాయానికి తక్షణమే విద్యుత్తు సర్వీసుల విడుదల... గ్రామీణ ప్రాంతాల్లో 3 ఫేజ్‌ విద్యుత్‌

వ్యవసాయానికి తక్షణమే విద్యుత్తు సర్వీసుల విడుదల...
గ్రామీణ ప్రాంతాల్లో 3 ఫేజ్‌ విద్యుత్‌

సేవాలోపంతోనే బిహెచ్‌ఐఎల్‌ టెండర్లను పరిగణలోకి తీసుకోలేదు : ఎపిఎస్‌ పిడిసిఎల్‌ సిఎండి కె. సంతోష రావు
వెల్లడి
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల ఆదేశాలకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు రైతులు అడిగిన వెంటనే విద్యుత్‌ సర్వీసులను విడుదల చేస్తున్నామని ఎపిఎస్‌ పిడిసిఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. సంతోష రావు తెలిపారు. స్థానిక ఎపిఎస్‌ పిడిసిఎల్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఎండి సంతోషరావు మాట్లాడారు. గతంలో యేడాదికోసారి కోటా మేరకు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను విడుదల చేసే పద్ధతి అమల్లో వుండేదన్నారు. అయితే ప్రస్తుతం రైతుల శ్రేయస్సు దష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి నిర్ణయం మేరకు తక్షణమే సర్వీసులను విడుదల చేస్తున్నామని తెలిపారు. 2019 నుంచి 2023 వరకు (ప్రస్తుతం వరకు) మొత్తం 2.34లక్షల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కేవలం 7,129 సర్వీసుల విడుదల మాత్రం పెండింగ్‌ వుందన్నారు. రైతుల సమస్యలపై తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డిఎస్‌ఎస్‌) కింద సంస్థ పరిధిలోని 3,900 ఫీడర్లను వేరు చేస్తున్నామన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా 3 ఫేజ్‌ విద్యుత్తును సరఫరా చేయడానికి అవకాశం వుంటుందన్నారు. ఆర్డిఎస్‌ఎస్‌ పథకం కింద చేపట్టే పనులకు కేంద్ర ప్రభుత్వం 60శాతం గ్రాంటును మంజూరు చేస్తుందని, మిగిలిన 40శాతం వ్యయాన్ని మాత్రమే సంస్థ భరించాల్సి వుంటుందని వివరించారు.ఈ పథకానికి సంబంధించిన పనులు 2026లోగా పూర్తి చేయాల్సి వుందని తెలిపారు.
సేవా లోపం కారణంగా బిహెచ్‌ఐఎల్‌ టెండర్లను పరిగణలోకి తీసుకోలేదు
ఎపిఎసిపిడిసిఎల్‌ పరిధిలో వివిధ పరికరాల కొనుగోలు కోసం గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌ (జెమ్‌) పోర్టల్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించం జరుగుతోందని సిఎం కె.సంతోష రావు చెప్పారు. విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డిఎస్‌ఎస్‌) కింద 2807 11కెవి విసిబిల సరఫరా కోసం జూన్‌-2023లోటెండర్లను ఆహ్వానించామని తెలిపారు. ఆ టెండర్లలో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఐఎల్‌) హైదరాబాద్‌, స్టైల్మెక్‌ లిమిటెడ్‌ ముంబయి, మెగావిన్‌ స్విచ్‌ గేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేలం సంస్థలు పాల్గొన్నాయని, వీటిలో స్టెల్మెక్‌ లిమిటెడ్‌ ముంబయి,మెగావిన్‌ స్వ్ఱిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేలం సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయని తెలియజేశారు. సాంకేతికంగా అర్హత సాధించడం కోసం విసిబిల పరిమాణం, పనితీరుకు సంబంధించిన ధవపత్రాలను బిహెచ్‌ఐఎల్‌ పొందుపరచలేదని దీంతో బిహెచ్‌ఐఎల్‌ సాంకేతికపరమైన అర్హతను సాధించలేదన్నారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా అంతిమంగా ధరను నిర్ణయించే సంధర్భంలో సాంకేతిక ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటామని,నిర్దిష్టమైన ధర ఖరారు కాకపోతే టెండర్లను రద్దు చేస్తామని తెలిపారు.
ప్రతిపాదనల దశలో విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి ప్రక్రియ
ఎపిఎస్‌ పిడిసిఎల్‌ విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్లను మార్పిడి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలను పంపించినట్లు సిఎండి సంతోష రావు తెలిపారు. విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవితకాలాన్ని 25 యేళ్ళుగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఏ) మార్గదర్శకాల్లో పేర్కొందని వివరించారు. వినియోగం సమయం పెరిగేకొద్దీ ట్రాన్స్ఫార్మర్‌ కోర్‌ సాచురేషన్‌, వైండింగ్‌ ఇన్సులేషన్‌ డ్యామేజ్‌, ఆయిల్‌ నాణ్యత లోపించడం కారణంగా ట్రాన్స్ఫార్మర్లో నష్టాలు పెరుగుతాయన్నారు. ఒక్క యూనిట్‌ నష్టానికి సుమారు రూ.8లచొప్పున నష్టం వాటిల్లుతుందని, తద్వారా సంస్థకు ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలను బలోపేతం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని (ఆర్డిఎస్‌ఎస్‌) అమలు చేస్తోందని, ఈ పథకానికి సంబంధించిన పనులను విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తేనే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రెండవ దశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అనుమతి కోసం పంపించామని, ఈ పథకంలో మొదటి దశ పనులకు సంబంధించి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణా మండలి (ఎపిఇఆర్సి) అమోదం తీసుకున్నామన్నారు. ఎపిఎస్పిడిసిఎల్లో అన్ని పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఈ-ప్రొక్యూర్మెంట్‌ ద్వారా జరుగుతాయని, రివర్స్‌ టెండరింగ్తోపాటు టెండరు ప్రక్రియ పారదర్శకంగా వుంటుందన్నారు. ఇందులో ఏ ఉత్పత్తిదారు అయిననూ పాల్గొని, టెండరు బిడ్‌ పత్రంలోని అర్హతల ప్రకారం క్వాలిఫై అయిన సంస్థలకు పనులను అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయాలు, సమస్యలపై వినియోగదారులు టోల్‌ ఫ్రీ నంబరు 1912 లేదా 1800 425 155333కు కాల్‌ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు.