
- ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామారావు
ప్రజాశక్తి-చల్లపల్లి: వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం చల్లపల్లిలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి కోతలు లేకుండా నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్ అందిస్తామని ప్రకటించారని, ఆచరణలో మాత్రం అది జరగడంలేదని విమర్శించారు. రైతులకు అందించే తొమ్మిది గంటల విద్యుత్‌ను ఏడు గంటలకు కుదించారని పేర్కొన్నారు. ప్రస్తుతం పొలాలన్నీ పొట్ట దశలో ఉన్నాయని, వ్యవసాయం కీలక దశలో ఉన్న సందర్భంలో నీళ్లు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాలువల్లో నీరు లేక, విద్యుత్ కోతలతో రైతులు నష్టానికి గురికావాల్సి వస్తుందన్నారు. ఏడు గంటలు ఇచ్చే విద్యుత్‌లో కూడా కోతలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాలువల ద్వారా నీళ్లు అందించడంలో విఫలమైన ప్రభుత్వం విద్యుత్‌నైనా సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హనుమానుల ురేంద్రనాథ్ బెనర్జీ, అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి రత్నగిరిరావు, అట్లూరి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతు సంఘం నాయకులు బండి రామకృష్ణ, కొర్రపాటి ముఖర్జీ, కొల్లూరి శ్రీధర్, నక్క శ్రీనివాసరావు, డొక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.