Oct 11,2023 22:06

తొమ్మిది గంటల వ్యవసాయ కరెంటు సరఫరా మాటలకే పరిమితం
రోజుకు ఐదారు గంటలు ఇవ్వడం కష్టమే
అదీ విడతల వారీగా సరఫరాతో అవస్థలు
రోజుకు అరెకరం కూడా తడవని దుస్థితి
పొట్టదశలోని వరి పొలాలు చూసి రైతుల ఆవేదన
సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగుతున్న అన్నదాత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పూర్తిగా పొంతన లేకుండాపోయింది. తొమ్మిది గంటల కరెంటు ఒకేవిడతగా సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న గొప్పలు వట్టి బూటకమని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయానికి కరెంటు సరఫరాలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అన్నదాత మండిపడుతున్నాడు. పొట్టదశలో ఉన్న వరిపొలాలకు నీరు లేక ఎండిపోతుండటంతో అన్నదాత ఆగ్రహాం కట్టలు తెంచుకుంటోంది. వ్యవసాయానికి నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలంటూ బుధవారం చింతలపూడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు రాఘవాపురం సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుత కరెంటు కోతలకు నిదర్శనంగా దీన్ని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాలో 27 మండలాలుండగా అత్యధిక మండలాలు మెట్టప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏలూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు సాగగా వ్యవసాయ బోర్లు కింద సాగుతున్న సాగు పెద్దఎత్తున ఉంది. దాదాపు లక్షకుపైగా బోర్ల కింద రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట కీలక దశకు చేరకుంది. పంటంతా పొట్టదశలో ఉంది. ఇటువంటి తరుణంలో వ్యవసాయ మోటార్లకు విధిస్తున్న కరెంటు కోతలతో అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేలకుపైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఇష్టానుసారం విధిస్తున్న కరెంటు కోతలతో బోర్లు పని చేయక పంటకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో పంట చేతికొస్తుందో.. లేదో అనే భయం రైతులను వెంటాడుతోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా వ్యవసాయానికి ఆరు నుంచి ఏడు గంటలు కూడా కరెంటు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ నాలుగు గంటలు ఒక విడతగా, మరో రెండు గంటలు, గంట అన్నట్లు కరెంటు సరఫరా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఒకపక్క వర్షాలు సరిగా పడకపోవడం, మోటార్లకు కరెంటు లేకపోవడంతో పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. చింతలపూడి మండలంలోని రాఘవాపురం సబ్‌స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాలకు ప్రస్తుతం కొనసాగుతున్న షిఫ్ట్‌ ప్రకారం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ వ్యవసాయ మోటార్లకు కరెంటు సరఫరా చేయాల్సి ఉంది. నాలుగు గంటలకు కరెంటు ఇచ్చి 7.30 గంటలకు కరెంటు కోత విధించినట్లు రైతులు చెబుతున్నారు. గట్టిగా మాట్లాడితే తర్వాత మరో రెండు గంటలు ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో రోజుకు అరెకరం భూమి కూడా తడవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆగ్రహించిన చింతలపూడి మండంలోని గణిచర్ల, రాఘవాపురం, అంకాలయ్య కొత్తగూడెం, యండవల్లి వంటి గ్రామాలకు చెందిన రైతులు రాఘవాపురం సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరిస్తామంటూ విద్యుత్‌ అధికారులు చెప్పడంతో విరమించారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తారా.. లేదా అనే భయం మాత్రం రైతులను వెంటాడుతోంది.
కరెంటు కోతలతో పొట్టదశలో ఉన్న వరి పంటకు దెబ్బ
చీకటి శ్రీనివాస్‌, అంకలయ్య కొత్తగూడెం, చింతలపూడి మండలం

ఐదెకరాల్లో వరిసాగు చేశాను. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. పామాయిల్‌కు కూడా నీరు అవసరం. రోజుకు ఏడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. అదీ ఒకసారి నాలుగు గంటలు, మరోసారి రెండు గంటలు అన్నట్లు కరెంటు సరఫరా చేస్తున్నారు. దీంతో వరిపంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. విడతలవారీగా ఇవ్వడం, తక్కువ సమయం ఇవ్వడంతో రోజుకు అరెకరం కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఇస్తే పంట గట్టెక్కుతుంది. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కరెంటు కోతలతో నలిగిపోతున్నాం
ఎం.శ్రీనివాసరావు, రాఘవాపురం

ప్రస్తుతం కొనసాగుతున్న షిఫ్ట్‌ ప్రకారం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ కరెంటు సరఫరా చేయాలి. కానీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇచ్చి ఉదయం 7.30 గంటలకు ఆపేస్తున్నారు. మళ్లీ ఇస్తే ఒక గంట, రెండు గంటలు ఇస్తున్నారు. రోజుకు అరెకరం కూడా తడవడం లేదు. పది హెచ్‌పి కెపాసిటీ మోటర్లున్నా నీరు రావడం లేదు. పదెకరాల్లో వరి సాగు చేశాను. పంట పొట్టదశలో ఉంది. ఈ తరుణంలో కోతలు రైతులను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి నెలకొంది. కరెంటు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.
రోజుకు ఏడు గంటలు మించి కరెంటు ఇవ్వడం లేదు
మామిడిపల్లి అప్పారావు, గణిచర్ల

ఒకేసారి కాకుండా విడతలవారీగా రోజుకు ఏడు గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నారు. పదెకరాల్లో వరిసాగు చేశాను. పొట్టదశలో ఉన్న పంట ఏమవుతుందోననే భయం వెంటాడుతోంది. కరెంటు గురించి అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఓ నెల రోజులు కరెంటు సవ్యంగా ఇస్తేనే వరిపంట గట్టెక్కుతుంది. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిరంతరాయంగా తొమ్మిది గంటలు కరెంటు సరఫరా చేసి పంటను కాపాడాలని కోరుతున్నాం.