ప్రజాశక్తి- బాపట్ల జిల్లా : వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ అత్యధిక రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా తెలిపారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు బాపట్ల జిల్లాలో అధికంగా ఉన్నందున రైతులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రూ. 3,595 కోట్లు, రబీ సీజన్ లో రూ 2,498 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ 2,981 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాల అభివద్ధికి రూ 854 కోట్లు రుణం ఇవ్వాలని లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిపారు. విద్యారంగానికి రూ.53 కోట్లు, గహనిర్మాణ రంగానికి రూ.218 కోట్లు, సామాజిక రంగాల అభివద్ధికి రూ 13 కోట్లు, ఇతర రంగాలకు రూ.648 కోట్లు రుణాలు ఇస్తామన్నారు. ప్రాధాన్యత లేని రంగాలకు రూ. 1,242 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యాలు నిర్దేశించు కున్నామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,860 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల అభివద్ధికి గత ఆర్థిక సంవత్సరంలో రూ 12,397 కోట్లు రుణాలు ఇచ్చినట్లు కలెక్టరు తెలిపారు. బ్యాంకులు లక్ష్యాలు చేరుకోవడంలో 138.59 శాతం పురోగతి సాధించామన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం శివకష్ణ, ఆర్‌బిఐ ఎల్‌డిఒ నాగప్రవీణ్,డిసిసి కన్వీనర్ డి.శంకర్రావు, నాబార్డు డిడిఎం శరత్, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.










