ప్రజాశక్తి - ఆదోని
విద్యుత్ కనెక్షన్ కోసం రుసుం చెల్లించిన రైతులకు 30 రోజుల్లోపు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ రావు తెలిపారు. గురువారం ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ శాఖ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. డిఇ, ఎఇలతో విద్యుత్ బకాయిలు, కనెక్షన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని తెలిపారు. కొందరు ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్‌లో లేకుండా ఇతరుల ప్రాంతాల్లో ఉంటున్నారని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, ఒఅండ్‌ఎం సిబ్బంది అందరూ నిర్దేశించిన హెడ్ క్వార్టర్స్‌లో ఉండి వినియోగదారులకు సేవలందించాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు, అంతరాయాలను తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు. వినియోగదారులు విద్యుత్ బిల్లుల చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేసే విధంగా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా వసూలు చేయాలని సూచించారు. చీఫ్ జనరల్ మేనేజర్‌లు గురువయ్య, ధర్మ జ్ఞాని, ఎస్‌ఇ ఉమాపతి, ఇంజినీర్ సుధాకర్ కుమార్, ఎడి పురుషోత్తం, రాఘవేంద్ర, రామకృష్ణ, నాగేంద్ర, ఎస్‌ఎఒ రాఘవులు, అసిస్టెంట్ ఇంజినీర్లు నరసన్న, ఉలిగప్ప, నాగభూషణం, సంతోష్, శారద, చెన్నయ్య పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న సిఎమ్‌డి సంతోష్ రావు










