Oct 15,2023 00:26

వ్యవసాయ విద్యుత్‌ కోసం మంత్రికి సిపిఎం వినతి

ప్రజాశక్తి-నకరికల్లు : రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రికి శనివారం వినతిపత్రం ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని చేజర్లకు వచ్చిన మంత్రి రాంబాబును సిపిఎం మండల కార్యదర్శి జి.పిచ్చారావు, నాయకులు ఇ.అప్పిరెడ్డి, ఎస్‌.రాంబాంజి నాయక్‌, సిహెచ్‌ కొండలు కలిశారు. గ్రామంలో 15 మంది పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారని, కానీ నేటికీ పొజిషన్‌ చూపలేదని చెప్పారు. సుగాలీలు ఎప్పటి నుండో సాగు చేస్తున్న భూముల్లో మైనింగ్‌ అనుమతిచ్చారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ సాగు భూములకూ పట్టాలివ్వాలన్నారు. ఈ మేరకు వినతిపత్రాన్ని మంత్రికి ఇచ్చారు. తహశీల్దార్‌తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.