Sep 05,2023 00:06
శిక్షణకు ఎంపికైన వ్యవసాయ విద్యార్థులతో అసోసియేట్‌ డీన్‌

ప్రజాశక్తి-బాపట్ల: వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న యాంత్రికరణలో భాగంగా వ్యవసాయ విద్యార్థులకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ నిర్వహిస్తున్నట్లు బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్‌ఛార్జి అసోసియేట్‌ బి విజయాభినందన్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర సెన్సార్స్‌ స్మార్ట్‌ అప్లికేషన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (అప్సర) ప్రాజెక్ట్‌ ద్వారా వ్యవసాయ విద్యార్థులకు లామ్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో డ్రోన్‌ పైలట్‌ శిక్షణకు ఎంపికైన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయాభినందన్‌ మాట్లాడుతూ రైతులు ఇతర వినియోగదారులకు అవసరమైన ప్రపంచ స్థాయి నైపుణ్యం గల వ్యవసాయ డ్రోన్‌ పైలట్లను ఉత్పత్తి చేయడంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏ సుష్మ, కె శ్వేత, శృతి హెచ్‌బిపి హనిశ్రీ, కెజె ఐడా, ఏ పవన్‌ సాయి మోహిత్‌, రిగ్జిన్‌ యంగ్మో, ప్రిస్కిల్లా, కె సాయి కిరణ్‌, టి కృష్ణ వంశీ ఎంపికైనట్లు తెలిపారు. వ్యవసాయ విద్యలు పూర్తిస్థాయి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఈ శిక్షణకు ఎంపికజేయడం జరిగిందన్నారు. వీరికి శిక్షణ ఈ నెల 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. డ్రోన్‌ ద్వారా విత్తనాలు చల్లడం. ఎరువులు, పురుగులు, తెగుళ్లకు క్రిమిసంహారక మందుల పిచికారీ విధానం వంటి శిక్షణ ఇస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చుకోవడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయానికి కూలీల సంఖ్య తగ్గుతుంది. దీంతో రైతు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో మంచి ఫలితాన్ని రాబట్టేందుకు ఇది దోహదపడుతుందన్నారు. సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక (ఎన్‌ఏహెచ్‌ఇపి)లో భాగంగా ఈ శిక్షణను ఇస్తారని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఐడిపి, ఎన్‌ఏహెచ్‌ఏపి కో ఆర్డినేటర్లు కె చంద్రశేఖర్‌, వి సీతారాంబాబు, బి రత్నకుమారి పాల్గొన్నారు.