Sep 16,2023 00:50

ప్రజాశక్తి - బాపట్ల
జాతీయ వ్యవసాయ విద్యా వ్యవస్థలో మిశ్రమ జ్ఞానార్జన ప్రధాన వేదిక కావాలని 
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ డీన్ అఫ్ అగ్రికల్చర్ నోడల్ అధికారి పి సుధాకర్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యాబోధనలో ఆన్ లైన్ విద్య, విద్యార్థులతో ముఖాముఖి బోధన అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ నూతన వ్యవసాయ విద్యా విధానం - 2020 అనుసరించి కళాశాలల్లో విద్యా బోధనా విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. మారుతున్న వ్యవసాయ పద్ధతులు, నూతన వంగడాల ఆవిష్కరణ, అధిక దిగుబడుల సాధన, వ్యవసాయంలో అధునాతన యాంత్రికరణ అంశాలపై  ప్రస్తుతం వ్యవసాయ విద్య తరగతి గదుల్లోనే నిర్వహిస్తున్నారని అన్నారు. ఆన్ లైన్ విద్యా బోధన కూడా ఇకపై విద్యార్థులకు అందించే దిశగా ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. కళాశాలలో మిశ్రమ జ్ఞానార్జన బోధనపై తీసుకోవలసిన చర్యలపై ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, కొత్త ఢిల్లి ఆచార్య ఎన్‌జి రంగా  వ్యవసాయ విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ విద్యా వ్యవస్థ - మిశ్రమ జ్ఞానార్జన  అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌కు చెందిన ఎన్ఏహెచ్ఏపి, ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సుదీప్ మార్వా ఆన్ లైన్ ద్వారా వ్యవసాయ ఆన్లైన్ విద్య బోధనపై వివరించారు.  అష్రఫుల్ హక్, సప్నా నిగమ్, కనిష్క అగర్వాల్, వికాస్ పూనియా ప్రత్యక్ష బోధనపై వివరణ ఇచ్చారు. విశ్వవిద్యాలయ పరిధిలో 6 వ్యవసాయ కళాశాలలు, 4వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, ఒక కమ్యూనిటీ సైన్స్ కళాశాల, వ్యవసాయ విశ్వ విద్యాలయ అనుబంధ  కళాశాలల బోధనా సిబ్బంది, వర్క్ షాప్ శిక్షణలో పాల్గొన్నారు. వర్క్ షాప్‌కు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ  విశ్వవిద్యాలయ సమాచార సాంకేతిక  విభాగానికి చెందిన సురేష్,  జాఫర్ అహ్మద్, ఖయ్యూమ్ అహ్మద్, రాజ్ కుమార్, ఎన్ఏహెచ్ఏపి కో ఆర్డినేటర్లు కె చంద్రశేఖర్, వి సీతారాంబాబు, బి రత్నకుమారి అనుసంధాల కర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాల ఏడి వి శ్రీనివాసరావు, వివిధ కళాశాలలకు చెందిన వ్యవసాయ బీఎస్సీ విద్యార్థులు, బోధన సిబ్బంది  పాల్గొన్నారు.