Oct 19,2023 20:59
పంట దిగుబడిని తూకం వేస్తున్న వ్యవసాయాధికారి

పీలేరు : గ్యాప్‌ సర్టిఫికెట్‌ సాధించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్‌ రైతులకు తెలియజేశారు. మండలంలోని కావలిపల్లె పంచాయతీ, మద్దెలచెరువు పాళెంలో 'గ్యాప్‌' సర్టిఫికెట్‌ సాధించిన రైతు రామ్మోహన్‌ పండించిన వేరుశనగ పంటలో గురువారం పొలంబడి నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను కేవలం స్థానిక మార్కెట్లలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకోవడానికి గ్యాప్‌ సర్టిఫికెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రసాయన వాడకం తగ్గించి, సేంద్రీయ ఎరువుల వాడకం పెంచడమే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం ద్వారా తమ ఉత్పత్తులకు మంచి ధరలు సాధించుకునే విధానాలను రైతులు అవగాహన చేసుకోవాలన్నారు. విత్తన దశ నుంచి సమగ్ర సస్యరక్షణ చర్యలతోపాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కేవలం వేరుశనగ పంటలోనే కాకుండా ఇతర పంటల్లోనూ గ్యాప్‌ సర్టిఫికెట్‌ సాధించుకునేందుకు రైతులు ప్రయత్నించాలన్నారు. పీలేరు మండలం తలపులలోని అన్నమయ్య రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అధిక శాతం మంది రైతులకు గ్యాప్‌ సర్టిఫికెట్‌ లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఆయన పంటకోత ప్రయోగం నిర్వహించారు. సాధారణ పద్ధతుల్లో ఎకరాకు 8 బస్తాలు పండించగా గ్యాప్‌ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా ఎకరాకు 13 బస్తాల దిగుబడి లభించిందన్నారు. ఆయనే స్వయంగా వేరుశనగకాయలను తూకం వేశారు. వేపులబైలు పంచాయతీలో నిర్వహించిన పంటకోత ప్రయోగంలోనూ ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో డ్యాబ్‌ సభ్యుడు బోదేషావలి, జిల్లా వనరుల కేంద్ర డీడీ సావిత్రి, ఏడీలు వైవి రమణరావు, శ్రీకాంత్‌, ఏఓలు రమాదేవి, షణ్ముగం, సుచిత, కెవికె కో-ఆర్డినేటర్‌ పాండురంగ, వ్యవసాయ శాస్త్రవత్త సోమశేఖర్‌, ఏఈవోలు నజీర్‌, అల్తాఫ్‌, ఇంద్ర, జ్యోత్స్న, చైర్మన్‌ మల్లికార్జున పాల్గొన్నారు.