May 19,2022 06:29

తన బాల్యంలోనే పాలేర్లతో చర్చించే సందర్భంలో వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, గ్రామంలోని పెద్ద రైతులు, భూస్వాములతో వారు ఏవిధంగా వంచించబడుతున్నారో అర్థం చేసుకున్నారు. ఇవి ఆయన వర్గ దృష్టిలో ప్రధాన మార్పు తెచ్చాయి. పేద రైతులు, వ్యవసాయ కూలీల తరపున ఒక డిమాండ్ల పత్రం తయారు చేసుకునేందుకు ఆయనకు తోడ్పడ్డాయి. ఈ మొత్తం సమస్యను ఆయన లోతుగా అధ్యయనం చేసేందుకు, రైతాంగంలో వర్గ విభజనను అర్థం చేసుకునేందుకు ఫ్యూడల్‌ భూస్వాములపై జరిగే పోరాటంలో ఎవరిని కలుపుకోవాలో తెలుసుకునేందుకు ఆయనకు ఈ అధ్యయనం తోడ్పడింది.

- బి.వి. రాఘవులు

పుచ్చలపల్లి సుందరయ్య తన సైద్ధాంతిక కృషిని నిరంతరం ఆచరణతో అనుసంధానించిన విప్లవకారుడు. ఆయన ఏ విషయాన్ని ఎంచుకున్నా, అది వ్యవసాయ సంబంధాల గురించి కావచ్చు, సాహిత్యం, సాంస్కృతిక పరిణామాల గురించి కావచ్చు దాన్ని తక్షణ కార్యాచరణతో అనుసంధానించేవారు. నిర్దిష్ట సామాజిక ఆర్థిక పరిస్థితుల అధ్యయనానికి సుందరయ్య అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. విస్తారమైన వివరాలు సేకరించకుండానే కొన్ని అభిప్రాయాలకు రావడానికి సుందరయ్య బద్ధ వ్యతిరేకి. ఆయన వాదనలు, ప్రతివాదనలు (కౌంటర్‌ ఆర్గ్యుమెంట్స్‌) ఎల్లప్పుడూ వాస్తవాలపై ఆధారపడి ఉండేవి. అందుకే ఆయన జీవిత ఆసాంతం పరిశోధకుడిగా, విద్యార్థిగానే ఉండేవారు. ఆయన సూక్ష్మ సమాచారానికి ఎక్కువ శ్రద్ధ చూపేవారు. సామాన్య ప్రజలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినేవారు. విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించు కునేందుకు ఆయన వద్ద ఒక పెద్ద పుస్తకం ఉండేది. ఆయన చొక్కా జేబు ఆ పుస్తకాన్ని ఇమిడ్చుకునేంత సైజ్‌లో ఉండేది.
వ్యవసాయ సమస్యలపై ఆయన నిష్ణాతుడిగా పరిగణింపబడేవారు. వ్యవసాయ సంబంధాల అధ్యయనంలో శ్రద్ధ ఆయన జీవిత కాలమంతా కొనసాగింది.సామాజిక మార్పు సాధించడంలో గ్రామాల ప్రాధాన్యతను సుందరయ్య చిన్ననాటి నుండే గుర్తెరిగారు. గ్రామీణ ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకోకుంటే దేశంలో సామాజిక మార్పు అసాధ్యమనే విషయం తన రాజకీయ జీవితం ప్రారంభదినాల నుండే ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. గ్రామాన్ని అర్థం చేసుకోవడం అంటే దేశాన్ని అర్థం చేసుకోవడం అనేవారు సుందరయ్య. అందుకే 1929-34 మధ్య ఎక్కువ సమయం తన స్వగ్రామం లోని కష్టజీవుల మధ్యే ఆయన గడిపారు. ఆ గ్రామంలో సామాజిక పీడనకు కారణమైన కుల వ్యవస్థను అధ్యయనం చేశారు, దానిపై పోరాడారు. పితృస్వామ్య సమాజాన్ని ఆయన దగ్గర నుండి పరిశీలించారు. ప్రతి కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొనే అసమానతలను, మహిళల సమానత్వం ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు. గ్రామీణ పేదలపై సాగుతున్న వివిధ రకాల ఆర్థిక దోపిడీని పరిశీలించారు. వ్యవసాయ కూలీలకు వస్తురూపంలో (ధాన్యం కొలిచేటప్పుడు) చిన్న మానికలతో కొలవడం, దళితులకు ఇతరుల కన్నా తక్కువ వేతనం ఇవ్వడం, కిరాణా షాపుల్లో మిగతావారి కంటే ఎక్కువ ధర వసూలు చేయడం ఆయన పరిశీలనలో తేలిన విషయాలు. భూ యాజమాన్యానికి, ఈ దోపిడీ పద్ధతులకు, సామాజిక అణిచివేతకు మధ్య ఉండే సంబంధాన్ని ఆయన ఈ అధ్యయనం నుండే మొదటిగా అవగాహన చేసుకున్నారు.
తన బాల్యంలోనే పాలేర్లతో చర్చించే సందర్భంలో వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో, గ్రామంలోని పెద్ద రైతులు, భూస్వాములతో వారు ఏవిధంగా వంచించబడుతున్నారో అర్థం చేసుకున్నారు. ఇవి ఆయన వర్గ దృష్టిలో ప్రధాన మార్పు తెచ్చాయి. పేద రైతులు, వ్యవసాయ కూలీల తరపున ఒక డిమాండ్ల పత్రం తయారు చేసుకునేందుకు ఆయనకు తోడ్పడ్డాయి.
ఈ మొత్తం సమస్యను ఆయన లోతుగా అధ్యయనం చేసేందుకు, రైతాంగంలో వర్గ విభజనను అర్థం చేసుకునేందుకు ఫ్యూడల్‌ భూస్వాములపై జరిగే పోరాటంలో ఎవరిని కలుపుకోవాలో తెలుసుకునేందుకు ఆయనకు ఈ అధ్యయనం తోడ్పడింది. ఆంధ్రలో మొదటిసారిగా ఈ వర్గ విశ్లేషణ చేయబడింది. దీనిపై 1937లో 'న్యూ యేజ్‌' పత్రికలో వ్యాసం రాశారు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ఆధారంగా నాటి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ వర్గ శ్రేణి ఏవిధంగా నిర్మితమైందో రాశారు. దాన్లో ఉమ్మడి పట్టాల గురించి, భూస్వాములకు ఏవిధంగా శిస్తు చెల్లిస్తున్నారో రాశారు. మార్క్సిస్టు - లెనినిస్టు సూత్రాల ఆధారంగా రైతాంగాన్ని ఒక విశాల ప్రాతిపదికన వర్గీకరించారు. వ్యవసాయ రంగంలో అణిచివేతకు గురయ్యే వర్గాల కూటమిని ప్రతిపాదించారు. ఆనాటికి అందుబాటులో ఉండే స్వల్పమైన రెవెన్యూ రికార్డులపై ఆధారపడి చేసిన ఆ అధ్యయనం అపురూపమైన విషయమే.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అజ్ఞాత జీవితం గడిపే సందర్భంలో ఆయన విస్తృతంగా గ్రామాలు పర్యటించి, ప్రాంతీయ కమిటీలను కలిసి మార్క్సిస్టు మూలసూత్రాలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా సమాచారం సేకరించుకున్నారు. రైతాంగంలో వర్గ విభజనను అవగాహన చేసుకునేందుకు ఇది తోడ్పడింది. దీని ఆధారంగా ''ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయక సమస్య'' అనే పదునైన వ్యాసాన్ని 'జనతా' పత్రికలో రాశారు. పార్టీలో వ్యవసాయ సమస్యపై తీవ్రమైన ఆంతరంగిక చర్చ 1950ల్లో జరిగింది. పార్టీ వ్యవసాయ విధానం ఎలా ఉండాలో అనే అంశంపై సాగిన చర్చలో పాల్గొన్న అనేక మంది ముఖ్యులలో సుందరయ్య ప్రముఖులు. వ్యవసాయ విధానాన్ని రూపొందించడానికి నియమించిన సబ్‌ కమిటీలో ఆయనున్నారు. ఆ సబ్‌ కమిటి తయారుచేసిన ముసాయిదానే చివరికి 1954లో ''రైతాంగంలో మన కర్తవ్యాలు'' అనే డాక్యుమెంటుగా రూపొందింది. 1958లో జాతీయ కౌన్సిల్‌ ఆమోదించిన ''వ్యవసాయ సమస్యలో కొన్ని కోణాలు'' రూపకల్పనలో ఆయనది ఒక ప్రధాన పాత్ర.
ఆ సమయంలో ఆయన వ్యవసాయ సమస్యలపై తీవ్రమైన పరిశోధన చేశారు. 1954లో ఆంధ్రప్రదేశ్‌ కమిటి ''ఆంధ్ర జిల్లాల్లో పార్టీ వ్యవసాయ కార్యక్రమం'' డాక్యుమెంటు తయారీలో సుందరయ్య కీలక భూమిక పోషించారు. 1958లో ''పార్టీ మరియు వ్యవసాయ కార్మికులు'' నోట్‌ సుందరయ్య తయారు చేశారు. ప్రతిసారి లాగే ఆయన వాదన తన క్షేత్రస్థాయి అనుభవంలోనుంచి, తాను సేకరించుకున్న వివరాల ఆధారంగానే సాగింది. ''వ్యవసాయ సంస్కరణల బిల్లు: కొన్ని సూచనలు'' అనే నోట్‌ కూడా ఆయన 1958లో రాశారు. ఆయన గ్రామాల్లో అలవరుచుకున్న పద్ధతి క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనం. అదే జీవిత కాలమంతా ఆయన విధానంగా ఉండింది. దీనికి ప్రధాన ఉదాహరణ 1974లో ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాల్లో ఆయన చేసిన పరిశోధన. అదే ''వ్యవసాయక సమస్య''గా 1976లో ఆయన వెలువరించిన ప్రామాణిక పత్రంగా నిలిచింది. ఆయన నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఈ పద్ధతే ఆయన అవలంభించారు. 1969లో వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేసే కార్యకర్తల శిక్షణా తరగతుల్లో వ్యవసాయంలో అదనపు విలువ ఏవిధంగా గుంజుకుంటున్నారో తన క్షేత్రస్థాయి పరిశీలనను అనుభవైక జ్ఞానంతో కలిపి బోధించారు.
సుందరయ్య తన బాల్యంలో గుర్తించిన గ్రామాల ప్రాధాన్యత, వ్యవసాయ సంబంధాలు భారత విప్లవోద్యమానికి సంబంధించినంత వరకు వన్నె తగ్గనివి. ఆనాడు గ్రామాల్లో 80 శాతం జనాభా నివశిస్తూంటే, నేడు 69 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్నారు. గత ఆరేడు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక కీలక మార్పులు జరిగినా వ్యవసాయం ప్రాధాన్యత తగ్గలేదు. 2019లో దేశ జిడిపి లో వ్యవసాయం వాటా 15శాతానికి పడిపోయినా, మూడింట రెండు వంతుల దేశ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అందుకే వ్యవసాయ సంబంధాల అధ్యయనం భారత విప్లవోద్యమానికి కీలకం.
ఇతర ఏదేశం కన్నా మన దేశంలో వ్యవసాయ సమస్య రాజకీయ పరంగా విమర్శనాత్మకమైందే కాక వివాద భరితమైంది. ఇది అత్యంత సంక్లిష్టమైంది. దీనికి కారణం, మనదేశ భౌగోళిక స్వరూపం, ఇది దాదాపు ఉపఖండం సైజ్‌లో ఉండటం, భిన్న వ్యవసాయ సంబంధాలు, పద్ధతులు చారిత్రాత్మకంగా పరిణామం చెందివుండటం, భూ సంబంధాల్లో వలస పాలకులు ప్రవేశపెట్టిన మార్పులు, స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ విధానం కోసం వచ్చిన మార్పులు. ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసిన ప్రస్తుత నయా ఉదారవాద దశలో వ్యవసాయంలో వచ్చిన మార్పులు. ప్రస్తుత బిజెపి మతోన్మాద ప్రభుత్వం దేశ విదేశ కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని తెరవడం వల్ల వ్యవసాయ సంక్షోభం పట్టపగ్గాల్లేకుండా తీవ్రమయింది. ఇది మొత్తం వ్యవసాయ సంబంధాల చలన శీలతనే మార్చివేసింది. ఈ సంక్లిష్టత సహజంగానే భిన్న అవగాహనలు మరియు వాదనలను తెస్తున్నది. దేశవ్యాపిత ఏకాభిప్రాయానికి రావడంలో ఇవి అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
వామపక్షాల మధ్య అనేక తేడాలున్నా, భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి, సమూల భూసంస్కరణలు అమలు చేయకుంటే దేశంలో విప్లవోద్యమం ముందుకు సాగదని అత్యధికులు అంగీకరిస్తారు. కాని గ్రామీణ వైరుధ్యాల ప్రాధాన్యత విషయంలో, సమూల మార్పుల కోసం జరిగే పోరులో వివిధ గ్రామీణ వర్గాల పాత్రపై భిన్నాభిప్రాయాలున్నాయి.వ్యవసాయ పరిస్థితులను మరియు విప్లవోద్యమ సంక్లిష్టతలను అవి ముందుకు తెచ్చిన అనేక ప్రశ్నలను నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా అధ్యయనం చేస్తేనే ముందుకు సాగగలుగుతాం. దానికి సుందరయ్య లాగే మనం కూడా నిరంతరం వ్యవసాయ సంబంధాలను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయి లోని నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయడమే మార్గం.

bvr

/ వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు/