
ప్రజాశక్తి-భట్టిప్రోలు: ప్రకృతి వ్యవసాయ రంగంలో పనిచేసే సిబ్బందికి సామర్థ్య పెంపుదలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరంలో బాపట్ల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో లభించే ఆకులు అలములతో కషాయాలు తయారు చేసుకుని పురుగు, దోమ నివారణకు పిచికారీ చేయాలని అన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంటకు నాము తెగులు, ఆకుముడత, చూడు దోమ వంటి తెగుళ్లు సోకాయని, రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం వలన ఖర్చు భారం పెరుగుతుంది తప్ప నివారణ పూర్తిస్థాయిలో జరగదని అన్నారు. ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను పండించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, దానికి గాను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచనలు పాటించి ఇంటి వద్దనే కషాయాలు తయారు చేసుకోవచ్చు అన్నారు. అలాగే సిబ్బంది కూడా రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందిస్తూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌ఎంపి మోహన్, ఎన్‌ఎఫ్‌ఏ, ఎంటిలు, వైఎస్సార్ క్రాంతి పథం సీసీలు, వివోఏలు, ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు.