పులివెందులరూరల్ : వ్యవసాయం చేసే ప్రతి రైతునూ శాస్త్రవేత్తను చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలోనే మొదటిసారిగా పులివెందులలోని ఏపీకార్ల్‌లో రైతు శాస్త్రవేత్త శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏపీ కార్ల్ ఏర్పాటు చేసిన రైతు శాస్త్రవేత్త శిక్షణ శిబిరాన్ని ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఏపీ కార్ల్ సిఇఒ రమణారెడ్డి మంత్రికి బుకే అందిం చి స్వాగతం పలికారు. ప్రకతి వ్యవసాయం సంబంధించి స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు. అంతకు ముందు ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు పరిశోధన కోర్సు అకాడమిక్ మొదటి బ్యాచ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న సుభిక్షంగా ఉండాలని సిఎం ఎన్నో పథకాలను తీసుకువచ్చి వారికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. వ్యవసాయంలో రసాయన ఉపయోగాన్ని పూర్తిగా తగ్గించి సహజసిద్ధమైన ఎరువులను వాడటం వల్ల, పర్యావరణ సహిత ఆరోగ్యకరమైన దిగుబడులను ఉత్తత్తి చేయడం రైతు శాస్త్రవేత్త కోర్సు ముఖ్య ఉద్దేశమని అన్నారు. అందుకు అనుగుణంగా సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు క్షేత్ర స్థాయిలో పూర్తిస్థాయి అవగాహన పెంపొందించడం, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న పలు సహజసిద్ద సాగుబడి పద్దతులను పరిచయం చేస్తారని చెప్పారు. రైతు శాస్త్రవేత్తలను కోర్సు ద్వారా రాష్ట్రంలో ప్రకతి వ్యవసాయం శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రకతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కోసం తయారు చేసిన మాడ్యుల్స్‌ను తరగతి గదుల్లో బోధిస్తారని చెప్పారు. రైతు శాస్త్రవేత్తలు తమ సొంత పొలంలో 'ఎ' గ్రేడ్ ప్రకతి వ్యవసాయ నమూనాలను తయారు చేయడం, వ్యవసాయ పాఠశాలలను నిర్వహించడం కమ్యూనిటీ శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. తొలి రెండేళ్లలో వెయ్యి మంది రైతు శాస్త్రవేత్తలను, ఆ తరువాత ప్రతి ఏటా రెండు నుంచి మూడువేల మంది రైతు శాస్త్రవేత్తలను తయారు చేయాలని రైతు సాధికార సంస్థ లక్ష్యంగా ఎంచుకుందన్నారు. కార్యక్రమంలో జెసి జి.గణేష్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర ఉద్యాన సలహాదారు పి.శివ ప్రసాద్ రెడ్డి, ఒఎస్‌డి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశులు, పురపాలిక చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజుల్లా, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజరు కుమార్, కమీషనర్ నరసింహా రెడ్డి, మార్కెట్ చైర్మన్ చిన్నప్ప, ప్రత్యేకాధికారి శివారెడ్డి హాజరయ్యారు.
సూక్ష్మ సేద్య పరికరాలను ప్రారంభించిన మంత్రి
ఐజి కార్ల్ ప్రాంగణంలో ఎపి మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా సూక్ష్మ సేద్యం, ఉద్యాన పంటల సాగునీటి సదుపాయం కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందిన రైతులకు సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా రెండు వేల హెక్టార్లకు పైగా సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్కక్కరిగా లబ్దిదారులకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, ఎడి అశోక్ రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్లు, మెంటార్లు, కోర్సులో చేరిన రైతులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి










