
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
- 2,33,969 మంది రైతులకు రైతు భరోసా నగదు జమ
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వరుసగా ఐదో ఎడాది వైఎస్‌ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు రైతులకు నేరుగా జమచేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. జిల్లాలో 2 లక్షల 33 వేల 969 మంది రైతులకు రూ.96.68 కోట్లు జమ చేశామన్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వరుసగా ఐదవ ఏడాది రెండవ విడతగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 53.53 లక్షల మంది రైతన్నలకు రూ 2,204.77 కోట్ల రైతు భరోసా పిఎం కిసాన్ ఆర్థిక సహాయం పంపిణీని బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ మైనార్టీ సలహాదారుడు హబీబుల్లా, మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా, నంద్యాల మండల అధ్యక్షుడు ప్రభాకర్, ఎపిఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, ఏంఎస్‌ఏంఈ డైరెక్టర్ అబ్దుల్ కలామ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులు, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు వరుసగా ఐదవ ఏడాది రెండవ విడతగా జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ చేసినట్లు చెప్పారు. దీంతోపాటు ఈ క్రాఫ్ బుకింగ్, పంటల బీమా ప్రీమియం, వైయస్సార్ యంత్ర సేవ పథకం కింద పరికరాలు, నాణ్యమైన విత్తన సరఫరా, సీడ్ విలేజ్ ప్రోగ్రాం తదితర కార్యక్రమాల లబ్ధిని కూడా రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 48,990 మంది రైతులకు రూ.20.36 కోట్లు, బనగానపల్లె 44,488 మందికి రూ.18.29 కోట్లు, డోన్ 37,375 మందికి రూ.15.38 కోట్లు, నందికొట్కూరు 42,302 మందికి రూ.17.49 కోట్లు, నంద్యాల 16,112 మందికి రూ.6.66 కోట్లు, పాణ్యం 15,649 మందికి రూ.6.45 కోట్లు, శ్రీశైలం 29,053 మందికి రూ.12.01 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు రూ. 4 వేల చొప్పున రైతు భరోసా పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.13,500 ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా పెద్ద ఎత్తున రైతు భరోసా ఆర్థిక లబ్దిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేకూరుస్తున్నారని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో 10 వేల మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ పంపిణీ చేశారన్నారు. అనంతరం ముఖ్య అతిధులు రైతులకు రైతు భరోసా, పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాల మెగా చెక్కును అందచేశారు.