ప్రజాశక్తి - యడ్లపాడు : 'వ్యవసాయ రంగంపై కార్పొరేట్ల దాడి - ప్రతిఘటనలో వ్యవసాయ కార్మికుల పాత్ర' సదస్సు జయప్రదం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండంలోని పలు ప్రాంతాల్లో బుధవారం బైక్ యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు యడ్లపాడులో నిర్వహిస్తున్న సందర్భంగా ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటలకు తహశీల్దార్ కార్యాలయం వద్ద సదస్సు జరుగుతుందన్నారు. సదస్సుకు రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు, రిటైర్డ్ ప్రొఫెసర్ వేణుగోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలురైతు రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, వై.రాధాకృష్ణ హాజరవుతారని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య అధ్యక్షతన నిర్వహించే సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, సిఐటియు మండల కార్యదర్శి తోకల కోటేశ్వరరావు పాల్గొంటారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల వ్యవసాయం రోజురోజుకీ దెబ్బతింటోందని, రైతులు, కూలీల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ గిట్టుబాటు కాక లక్షలాది ఎకరాల భూమి సాగుకు దూరమై బీడవుతోందని అన్నారు. వ్యవసాయ కూలీల వలసలు నివారించాలన్న, రైతుల ఆత్మహత్యలు నివారించబడాలన్న, వ్యవసాయం రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం పోరాడాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా నిర్వహించే సదస్సులో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రోశయ్య, జె.శంకర్రావు, ఎం.పద్మారావు పాల్గొన్నారు.










