Jul 24,2023 00:16

వరి నారును వేస్తున్న గిరిజన మహిళలు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని జిల్లాలోని ముంపు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ తాజాగా కురిసిన వర్షాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. జిల్లాలోని ముంపు మండలాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఖరీఫ్‌ వ్యవసాయ పనులతో మన్యంలోని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో వ్యవసాయ భూములన్నీ తడిచి ముద్దయ్యాయి. గిరిజన రైతులు ఖరీఫ్‌ వరి సాగు పనుల్లో నిమగమయ్యారు. ప్రస్తుతం పలువురు రైతులు నారుమడులను సిద్ధం చేసుకుంటుండగా, మరి కొంతమంది నాట్లు వేస్తున్నారు. వేసిన నారుమళ్లు ఆశాజనకంగా ఎదగడంతో వాటిని సేకరిస్తున్న గిరిజన రైతులు ప్రస్తుతం వరి నాట్ల పనుల్లో బిజీగా మారారు. అన్నిచోట్ల వరి నాట్లు పనులు హుషారుగా జరుగుతున్నాయి. దీంతో ఏజెన్సీలోని గిరిజన రైతులంతా ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు.
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో లక్షా 21 వేల హెక్టార్లలో పంటలు సాగు అవుతుండగా, దానిలో వరి 59,189 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ముందస్తుగా వేసిన నారుమడులన్నీ ఆశాజనకంగా ఎదగడంతో వాటిని సేకరించిన గిరిజన రైతులు దమ్ము పనులు పూర్తయిన పంట భూముల్లో వరి నాట్లను ముమ్మరం చేశారు. వరదల కారణంగా చింతూరు ఐటిడిఎ పరిధిలోని చింతూరు, కూనవరం, విఆర్‌ పురం, ఏటపాక మండలాల్లో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. విలీన మండలాల్లో గోదావరి వరదల విలయంతో వ్యవసాయ భూములన్ని ముంపు బారిన పడడం బాధాకరం. మిగిలిన మండలాల్లో మాత్రం వర్షాలు వ్యవసాయ భూములకు మేలు చేయడంతో ఆయా రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి వర్షాలు సమృద్ధిగా కురిసాయి. దీంతో, మే నెలాఖరు నుంచి రైతులు వేసవి దుక్కి పనులను ప్రారంభించి జూన్‌ నెలాఖరుకి దుక్కి పనులు పూర్తి చేశారు. అలాగే మెట్ట ప్రాంతంలో రాగులు వేసుకునే రైతులు సైతం నారు నాటడం, విత్తనాలు వెదజల్లే పద్ధతిలో రాగుల సాగుకు అవసరమైన దుక్కి పనులు చేపడుతున్నారు. దీంతో, ప్రస్తుతం ఏజెన్సీలో ఎటు చూసినా పచ్చని వ్యవసాయ భూములు, ఆయా భూముల్లో వ్యవసాయ పనులు చేపడుతున్న గిరిజన రైతులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం వరి నాట్లన్నీ హుషారుగా జరుగుతుండటంతో జులై నెలాఖరు, ఆగస్టు మొదటి వారానికల్లా మొత్తం వరి నాట్లు పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.