ప్రజాశక్తి - జీలుగుమిల్లి
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే ప్రతిఘటిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం స్థానికంగా ఆ సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై సదస్సు సంఘం మండల అధ్యక్షులు దాసరి జానకిరామరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పలు రైతాంగ సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యఅతిథి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నేడు వ్యవసాయం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేందుకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల పోరాటంతో రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు కుట్రలు చేస్తోందని, అందుకు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీటర్లు బిగించే ప్రక్రియను చేపట్టిందని విమర్శించారు. ఎక్కడైనా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు తెల్లం దుర్గారావు, రైతుసంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య మాట్లాడుతూ భూసేకరణ పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమన్నారు. ఆయిల్ పామ్ టన్ను గెలలకు రూ.20 వేలు ధర ఇవ్వాలని కోరారు.
రైతుసంఘం జెండావిష్కరణలు
డిసెంబర్ 13 నుండి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్న సందర్భంగా జీలుగుమిల్లి, పాములవారిగూడెం, పూచికపాడు, జగన్నాధపురం గ్రామాల్లో రైతుసంఘం జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, టి.సూర్యారావు, సుంకవల్లి శేషగిరి, వీరంకి నరేష్, వెలమాటి నరసింహారావు పాల్గొన్నారు.










