ప్రజాశక్తి-అనకాపల్లి
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అనకాపల్లి ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అంటే రైతు మెడకు ఉరితాళ్లు బిగించడమే అవుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనూరు మల్లు నాయుడు మాట్లాడుతూ ఒకవైపు పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే మరోవైపు విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి రైతును మరింత కుదేలు చేయడం దారుణమన్నారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి ముసలి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల ముందు జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించి క్రషింగ్ జరిపిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు నడుస్తున్న కర్మాగారాలను వేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు అక్కిరెడ్డి రమణబాబు, కాలింగ సన్యాసినాయుడు, మళ్ల నరసింగరావు, పుల్లింగల గోవింద, పేరపు కొండబాబు, బంటు గణేష్, కె.కోటేశ్వరరావు, జి వెంకటరావు, పెంటకోట లోవకృష్ణ, భీమరశెట్టి శ్రీనివాసరావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.










