Oct 10,2023 21:48

స్టిక్కర్ల అతికింపును అడ్డుకుంటున్న సిపిఎం నాయకులు

         ప్రజాశక్తి-పుట్లూరు   మండలంలోని ఓబుళాపురం గ్రామంలో వ్యవసాయ విద్యుత్‌ డీపీలు, మోటార్లకు స్కాన్‌ క్యూర్‌ కోడ్‌ స్టిక్కర్లను అతికించడానికి వచ్చిన విద్యుత్‌ అధికారులను రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వ్య.కా.సం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కృష్ణమూర్తి, ఎస్‌.సూరి, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటచౌదరి మాట్లాడుతూ ఇప్పటికే రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చాలామంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బిజెపి విధానాలను అమలు పరచడంలో భాగంగా రైతు మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహంతో అమలు చేస్తూ రైతుల విద్యుత్‌ డీపీలు, మోటార్లకు స్కానర్లను సర్వే రూపంలో స్టిక్కర్లు అతికించడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, భాస్కర్‌, నాయకులు చిన్న నాగన్న, నాగేశ్వర్‌, గోపాల్‌, రామాంజనేయులు, రామ్మోహన్‌, రైతులు పాల్గొన్నారు.