Aug 31,2023 22:30

భూమిని చదును చేసుకుంటున్న పేదలు

ప్రజాశక్తి - రొద్దం : శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలం కొగిర రెవిన్యూ గ్రామంలోని 4 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని 4 గ్రామాలకు చెందిన వందలాది మంది పేదలు వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో దుక్కిదున్ని విత్తనం వేశారు. ఈ చర్యలను ఇదివరకే భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న టింబక్టివ్‌ ట్రస్టుకు చెందిన వారు గుండాల సాయంతో అడ్డుకున్నారు. అయితే పేదలు, నాయకులు ప్రతిఘటించడంతో వారు వెనుతిరిగారు.
మండలంలోని కొగిర రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 666 - 669లోని 4వేల 4వేల ప్రభుత్వ భూమిలో భూమిలేని నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. పేదలకు పట్టాలిస్తామని చెప్పి ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈ భూమిని బడాబాబులకు అప్పజెప్పడానికి అధికారులు కుట్రపన్నారు. టింబక్ట్‌ ట్రస్ట్‌ పేరుతో బడా నాయకులు పేదలను భూముల నుండి తరలించి అక్రమంగా అడవిలో ఉన్న అడవి సంపదను అక్రమంగా దోచుకోవటానికి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన పేదలు వ్యకాసం ఆధ్వర్యంలో భూపోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన పేదలు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వి. వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ నేతృత్వంలో వ్యకాసం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎర్ర జెండాలు చేత పట్టి భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్లతో దుక్కి దున్ని విత్తనాలు వేశారు. భూమి కోల్పోయిన నాలుగు గ్రామాల పేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూమిలోకి ప్రవేశిస్తుంటే ట్రస్ట్‌ పేరుతో ఉన్న కొందరు గుండాలను వెంటబెట్టుకుని మారణాయుధాలతో పేదలపై దాడికి పూనుకున్నారు. అప్పటికే ఆవేశంతో ఉన్న పేదలు ఎర్రజెండాలు ధరించిన కర్రలతో ప్రతిఘటించారు. తాము వెంట తెచ్చుకున్న దురదగుంట ఆకుతో మద్యం తాగి దాడికి వచ్చిన గుండాల శరీరాలకు రుద్దారు. దీంతో ఆ దురదను భరించలేక గూండాలు వెనక్కు తగ్గారు. అదే ఊపుతో ఉన్న పేదలు భూమి లోకి ప్రవేశించి దున్ని , విత్తనాలు చల్లారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ భూమి అని అన్నారు. ఇక్కడి పేదలు రెండు తరాల నుండి ఈ భూమిలో సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టాలిస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ భూమిని బడా నాయకులకు అప్పజెప్పడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ఈ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతూ నిత్యం దళిత , గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వం ప్రస్తుత భూ పంపిణీలో సాగుదారులకు న్యాయం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. సంఘం అధ్యక్ష , కార్యదర్శులు ప్రవీణ్‌ , పెద్దన్న మాట్లాడుతూ సాగులో ఉన్న పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ , జిల్లా కమిటీ సభ్యులు నారాయణ , వెంకట్‌ రాముడు , కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ , సాగుదారులు జయమ్మ , అనిత , రామాంజనమ్మ మారుతి , నారాయణ , ఓబమ్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.